రెగ్యులర్ రొటీన్ ప్రేమకథలకు సినిమాల్లో కాలం చెల్లింది. అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీస్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'ఆరోమలే'. గత నెలలో తమిళంలో రిలీజై హిట్ అయింది. రొమాంటిక్ కామెడీ జానర్‌లో తీసిన ఈ చిత్రంలో కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లు. ఇప్పుడు ఇది హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!)
కథేంటి?
అజిత్ (కిషన్ దాస్) మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజీలో ఓ ప్రేమకథా సినిమా చూసి, తనకు కూడా ఇలాంటి లవ్ స్టోరీనే కావాలని ఫిక్స్ అయిపోతాడు. స్కూల్‌లో ఉన్నప్పుడు స్మృతి, కాలేజీలో మేఘ, పెద్దయ్యాక స్నేహ(మేఘా ఆకాశ్)ని ప్రేమిస్తాడు. కానీ వాళ్లు పట్టించుకోరు. తీరా చదువు పూర్తయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఓ మ్యాట్రిమోనీ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ అంజలి(శివాత్మిక రాజశేఖర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమెనే తనకు టీమ్ లీడర్ అని తెలిసి షాక్ అవుతాడు. ఆమెకు ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండదు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారం అనుకునే టైపు. ఇలా ప్రేమ విషయంలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వీళ్లిద్దరి జీవితంలో ఏం జరిగింది? ప్రేమలో ఎందుకు పడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ప్రేమ అనే దానికి సరైన డెఫినిషన్ అంటూ ఏం లేదు. ఎవరికి వాళ్లు స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ అనుభూతిని అర్థం చేసుకోవడం కష్టం. అదే ప్రేమలో ఉన్న మహత్తు. పెళ్లి చేసుకోవద్దని ఎవరైనా చెబితే వింటారేమో గానీ ప్రేమలో పడొద్దని చెబితే ఎవరూ వినరు. అలా ప్రేమ కోసం తపించే ఓ యువకుడి స్టోరీనే ఈ సినిమా.
సినిమా గురించి చెప్పాలంటే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ ప్రేమకథలతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉంది. రెండు గంటల సినిమాలో ప్రేమ, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని ఫెర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకున్నారు. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హీరోహీరోయిన్ కలవాలి అని ఏదో హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం మూవీ మరో లెవల్లో ఉండేది.
థియేటర్‌లో ఓ ప్రేమకథా సినిమా చూసి లవ్ అంటే బయట కూడా ఇలానే ఉంటుందని హీరో అనుకోవడం.. తర్వాత స్కూల్, కాలేజీ లైఫ్‌లో ప్రేమలో పడటం.. కనీసం వ్యక్తపరిచే అవకాశం రాకుండా అవి ముగిసిపోవడం ఇలా తొలి 20 నిమిషాల్లో చకచకా సీన్లన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అంజలి పనిచేసే మ్యాట్రిమోనీ కంపెనీలో అజిత్ చేరతాడో అక్కడి నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
ఫస్టాప్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌తో పాటు వీటీవీ గణేశ్ ఎపిసోడ్, హీరో తల్లి గతం ఎపిసోడ్ ఇలా డిఫరెంట్ లేయర్స్ చూపిస్తారు. స్టోరీ నుంచి సైడ్ అవుతున్నారేమో అనిపించినా చివరకొచ్చేసరికి హీరోహీరోయిన్‌ని కలపాలి కాబట్టి కలిపేశాం అన్నట్లు అనిపించింది. ఇలా ఒకటి రెండు కంప్లైంట్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఫీల్ గుడ్ మూవీ చూశాం అనిపిస్తుంది.
చెప్పాలంటే ఇది చాలా సింపుల్ కంటెంట్.. బడ్జెట్ పరంగా చూసినా చిన్న సినిమా. కానీ స్టోరీలోని పాయింట్ బాగుంది. తెచ్చిపెట్టుకున్నట్లు కాకుండా సీన్లన్నీ చాలా సహజంగా ఉంటాయి. జీవితంలో ఓదార్చేవాళ్లు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదనే మెసేజ్ కూడా బాగుంది. పేరుకే ప్రేమకథ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్స్ చేసే కామెడీ కూడా ఆకట్టుకుంది.
ఎవరెలా చేశారు?
అజిత్ పాత్రలో కిషన్ దాస్ యాక్టింగ్ బాగుంది. అంజలి పాత్రలో శివాత్మిక రాజశేఖర్ బాగా చేసింది. మిగిలిన వాళ్లలో వీటీవీ గణేష్, తులసి పాత్రలు అసలెందుకు ఉన్నాయి అని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. కానీ కథని మలుపు తిప్పే పాత్రల్లో వీళ్లిద్దరూ ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది. పాటల్లో మ్యూజిక్ బాగున్నా సాహిత్యం బాగోలేదు.
డైరెక్టర్ సారంగు త్యాగు గురించి చెప్పుకోవాలి. సినిమాటిక్ లిబర్టీ అని ఏది పడితే అది తీసేయలేదు. సాదాసీదాగా ప్రేమ ఎలా ఉంటుందో అలానే చూపించాడు. చాలామంది ఈ పాత్రల్లో తమని తాము చూసుకునేలా తీశాడు. ఇతడికి టెక్నికల్ టీమ్, యాక్టర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే ఈ సినిమాని కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)


