‘‘నేను లిరిసిస్ట్‌గా 2012లో కెరీర్ స్టార్ట్ చేస్తే, అప్పట్నుంచి నంది అవార్డులు లేవు. మన ప్రతిభకు అవార్డులు కొలమానం కాదని భావిస్తాను. ఒకవేళ అవార్డ్స్ వస్తే అవి బోనస్’’ అని చెప్పారు ప్రముఖ గీత రచయిత కేకే (కృష్ణకాంత్). నేడు (శనివారం) కేకే పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘2025లో నేను పాటలు రాసిన 22 చిత్రాల నుంచి 45 పాటలు విడుదలయ్యాయి.
2025లో నాకు చాలెంజింగ్‌గా అనిపించిన పాట ‘ది రాజాసాబ్’ సినిమాలోని ‘సహనా సహనా’. ఇక ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌గార్లు కలిసి డ్యాన్స్ చేసిన ‘సలామ్ అనాలి’ (‘వార్ 2’ సినిమా) పాట రాయడం సంతోషంగా అనిపించింది. రజనీకాంత్‌గారి ‘కూలీ’ సినిమాలోని ‘మౌనిక’ పాట తెలుగు వెర్షన్ రాశాను. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాలోని అన్ని పాటలు రాశాను. ‘మిరాయ్’ చిత్రంలోని ‘వైబ్ ఉంది’ సాంగ్ యూట్యూబ్‌లో 130 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లింది. ప్రభాస్, నాని, శ్రీవిష్ణుగార్లు నన్ను నమ్మి అవకాశం కల్పిస్తున్నారు.
నేను ప్రభాస్‌గారి అభిమానిని. కెరీర్ ఆరంభంలో ఆయన సినిమాలకు పాటలు రాస్తే బాగుండు అనుకునేవాడిని. ఇప్పుడు ప్రభాస్‌గారి వరుస చిత్రాలకు (సాహో, రాధేశ్యామ్, సలార్, ఫౌజి) పాటలు రాయడం హ్యాపీ. ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజి’, ఎన్టీఆర్‌గారి ‘ఎన్టీఆర్ నీల్’, విజయ్ సేతుపతి ‘పూరీ సేతుపతి’ సినిమాలతో పాటు చాలా సినిమాలకు పాటలు రాస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా పాటల్లో ఇంగ్లిష్ పదాలు తక్కువగానే ఉంటాయి. ‘ది రాజాసాబ్’లో ‘శరచ్చంద్రికా తేజయామిని..’ పాట రాశాను. చాలామందికి ఈ పదాలు అర్థం కాలేదు. అర్థం కాలేదని తెలుగు రాయకుండాపోతే మన భాషను మర్చిపోతాం. అయితే ట్రెండ్‌నూ ఫాలో అవుతాను’’ అని చెప్పారు.


