‘పతంగ్‌’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Patang Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘పతంగ్‌’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Dec 26 2025 12:33 PM | Updated on Dec 26 2025 12:57 PM

Patang Movie Review And Rating In Telugu

టైటిల్‌: పతంగ్‌
నటీనటులు: వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్,విష్ణు ఓఐ, అను హసన్ తదితరులు
రచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి
నిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డి
సంగీతం: జోస్ జిమ్మి
సినిమాటోగ్రఫి: శక్తి అరవింద్
ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పు
విడుదల తేది: డిసెంబర్‌ 25, 2025

ఈ ఏడాది చివరి వారంలో తెలుగులో ఛాంపియన్‌, శంబాల, దండోరాతో పాటు మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అయితే వాటిల్లో ఒకటి పతంగ్‌. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ బాగున్నప్పటికీ నటీనటులంతా కొత్తవారే కావడం.. ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయకపోవడంతో సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేయలేకపోయాయి. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండానే డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

‘పతంగ్‌’ కథేంటంటే.. 
హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ(వంశీ పూజిత్‌), అదే ప్రాంతంలో ఉండే రిచ్‌ కిడ్‌ అరుణ్‌(ప్రణవ్‌ కౌశిక్‌) చిన్నప్పటి నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి  ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్ఫ్యూజ్డ్ మైండ్‌ సెట్‌. ఏ విషయంలో అయినా సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. ఆమె వల్ల ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్‌ల మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యను దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ పెడతారు. ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీనే ఎందుకు పెట్టారు? ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
కొన్ని సినిమా కథలలో కొత్తదనం ఉండదు. అలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. అయినా కూడా తెరపై చూస్తుంటే ఎంజాయ్‌ చేస్తాం. అలాంటి సినిమానే పతంగ్‌. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే ఉండదు. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఎంచుకున్న ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ పాయింట్‌ కూడా చాలా రొటీన్‌. అయితే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్‌ చాలా ఫ్రెష్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆర్య, ప్రేమదేశం లాంటి ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీని హైదరాబాద్‌ స్టైల్లో చెబుతూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేశాడు దర్శకుడు ప్రణీత్‌. సన్నివేశాలు పాతవే అయితే.. డైలాగ్స్ ఫ్రెష్‌గా, యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. అలా అని బూతు సంభాషణలు, సన్నివేశాలేవి ఇందులో ఉండవు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించారు.

ఫస్టాఫ్‌ మొత్తం ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఐశ్వర్య-విస్కీల లవ్‌స్టోరీతో పాటు అరుణ్‌తో ఐశ్వర్య క్లోజ్‌ అయ్యేలా సాగే సన్నివేశాలన్నీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అలా చూస్తుండగానే ఇంటర్వెల్‌ అవుతుంది. ఇక సెకండాఫ్‌ ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ.. పతంగ్‌ల పోటీ మొదలైన తర్వాత పరుగులు పెడుతుంది.  సెకండాఫ్‌ కథ మొత్తం పతంగ్‌ల పోటీ చుట్టూనే తిరుగుతుంది. అయినా కూడా ఒక్క చోట బోర్‌ కొట్టదు.  విష్ణు ఇచ్చే కామెంటరీ నవ్వుల డోస్‌ని మరింత పెంచేస్తుంది. ఇక ముగింపులో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా యువతను ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కొత్త కథను ఆశించకుండా పతంగ్‌ సినిమాకు వెళ్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా ఎంటర్‌టైన్‌ అవ్వొచ్చు. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులంతా కొత్తవారే.అయినా కూడా చక్కగా నటించారు. హైదరాబాద్‌లోని బస్తీ యువకుడు విస్కీగా వంశీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రణవ్‌ స్క్రీన్‌ ప్రెజన్స్‌ బాగుంది. ఇక సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రీతి పగడాల ఇందులో హీరోయిన్‌గా నటించింది.కన్ఫ్యూజ్డ్ మైండ్‌ సెట్‌ ఉన్న ఐశ్వర్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. అరుణ్‌  చెల్లిగా నటించిన విజ్ఞాని తెరపై క్యూట్‌గా కనిపించింది.  అరుణ్‌ తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్‌.. ఎమోషనల్‌ సీన్లని బాగా పండించాడు. అరుణ్‌ని ఇష్టపడే లక్ష్మీ పాత్ర పోషించిన నటి కూడా బాగా చేసింది. ముఖ్యంగా పతంగ్‌లో పోటీలో ఆమె చేసిన డ్యాన్స్‌ నవ్వులు పూయిస్తుంది. అరుణ్‌-విస్కీల ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జోస్ జిమ్మీ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వెరైటీగా, ఆకట్టుకునేలా ఉంటాయి. బీజీఎం అదిరిపోయింది.  శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement