కేవలం సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌కు కోట్ల రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన ఐ బొమ్మ రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని గురించే చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి గురించి ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం సినిమాలో సూపర్ హిట్ సీన్‌లా ఉందన్నారు. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో తీసుకెళ్లి కటాకటాల వెనక్కి పంపినట్లు ఉందని తెలిపారు. తనకు తానే భస్మాసుర హస్తంలాగా బయట పెట్టుకున్నాడు.. పోలీసులతో ఎవరూ కూడా ఛాలెంజ్ చేయవద్దని అన్నారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందే రాజమౌళితో పాటు మెగాస్టార్, నాగార్జున కలిసి సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు.
ఇదొక పెద్ద అచీవ్‌మెంట్.. మెగాస్టార్
ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం పెద్ద అచీవ్‌మెంట్ అని మెగాస్టార్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పైరసీ వల్ల గేమ్ ఛేంజర్, ఓజీ, కింగ్‌డమ్ లాంటి పెద్ద సినిమాలు చాలా నష్టపోయాయని తెలిపారు. రాజమౌళి పెద్ద సినిమా చేస్తున్నారని..మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటుతున్న సమయంలో పైరసీ అనేది ఇండస్ట్రీకి చాలా బాధ కలిగిస్తుందని చిరంజీవి అన్నారు.


