'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి? | iBomma Takedown Is Just The Beginning, Tollywood Urged To Address Larger Issues, More Details Inside | Sakshi
Sakshi News home page

Tollywood Piracy Case: అంతా అయిపోలేదు.. మిగతా వాటినీ ఇలా చేస్తేనే

Nov 17 2025 4:03 PM | Updated on Nov 17 2025 6:58 PM

I Bomma Issue And Other Problems Of Telugu Movies

సినిమా ప‌రిశ్ర‌మ‌ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. థియేటర్లలో కొత్త మూవీ ఇలా రిలీజైన వెంటనే అలా పైరసీ సైట్లలోకి వచ్చేంత టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో ప్రతిసారి హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోమంటూనే ఉన్నారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు ఇప్పుడు చిన్న ఉపశమనం లభించింది. అదే 'ఐ బొమ్మ' సైట్‌ని క్లోజ్ చేయడం. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఈ సైట్ ప్రధాన సుత్రధారిని ఈ మధ్యే పట్టుకున్న పోలీసులు.. అతడితోనే దగ్గరుండి మరీ సైట్ పూర్తి క్లోజ్ చేయించారు. ఇక్కడితో సమస్య తీరిపోయిందా అంటే అస్సలు కాదు.

పైరసీ అనేది బలమైన వేళ్లతో భూమిలో గట్టిగా పాతుకుపోయిన మహావృక్షం లాంటిది. దీనిలో 'ఐ బొమ్మ' అనేది కేవలం ఓ కొమ్మ మాత్రమే. ఈ సైట్ రన్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న రవిని పోలీసులు పట్టుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ ఒక్క సైట్ మూసేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటివి బయట వందల్లో ఉన్నాయి. దీనిలానే వాటిని కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ రావాలి. దేశంలోని పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ 'ఐ బొమ్మ'పై పెట్టినంత దృష్టి మిగతా వాటిపైనా రాబోయే రోజుల్లో ఏ మేరకు పెడతారో చూడాలి.

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

పైరసీ సైట్స్ అనే కాదు గూగుల్ లాంటి వెబ్ సైట్లలో ప్లే స్టోర్స్‌లో దొరకని, వందల సంఖ్యలో ధ్రువీకరించని యాప్స్ APK ఫైల్స్ పేరిట జనాలకు అందుబాటులో ఉన్నాయి. కాస్తోకూస్తో చదువుకున్నోళ్లకు వీటి గురించి తెలుసు. చెప్పాలంటే చదువుకోని వాడు.. తనకు తెలిసిన ఒకటో రెండో సైట్లలో మాత్రమే పైరసీ సినిమాల్ని చూస్తాడు. చదువుకున్నోళ్లు మాత్రం విచ్చలవిడిగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయా వెబ్‌సైట్లని దగ్గరుండి నడిపించేవాళ్లు మన దేశస్థులు కావొచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ మన పోలీసులు ప్రయత్నించినా సరే దొరుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితి.

కాబట్టి పైరసీ సమస్యతో పాటు ఇండస్ట్రీలోని మిగతా సమస్యలపై కూడా సినీ పెద్దలు కచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టికెట్ రేట్లు అందుబాటులోకి తీసుకురావడం, రొటీన్ సినిమాలు కాకుండా కాస్త కంటెంట్ ఉండే సినిమాలని తీసుకురావడం లాంటివి చేస్తే.. రాబోయే రోజుల్లో ప్రేక్షకుడే పైరసీ వద్దనుకుని థియేటర్‌కి వస్తాడు. లేదంటే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది!

(ఇదీ చదవండి: మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు: నాగార్జున)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement