పైరసీ సైట్ 'ఐ బొమ్మ' సూత్రధారి ఇమ్మది రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు రిమాండ్‌లో ఉన్నాడు. ఇతడిని అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ సీపీ సజ్జనార్.. సోమవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. పోలీసులని మెచ్చుకుంటూనే పలు విషయాలు మాట్లాడారు. అయితే నాగార్జున చెప్పింది మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.
(ఇదీ చదవండి: తెలంగాణ పల్లెలో చావు చుట్టూ జరిగే కథ.. టీజర్ రిలీజ్)
'ఉచితంగా సినిమా చూపించడం అనేది ఓ ట్రాప్. ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం. కానీ సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్‌సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకు వెళ్ళిపోతాయి. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము. వాళ్ల సంపాదన వేల కోట్లల్లో ఉంటుంది' అని నాగార్జున తన కుటుంబంలో ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు.
డిజిటల్ అరెస్ట్ అంటే?
డిజిటల్ అరెస్ట్‌లో భాగంగా మోసగాళ్లు.. ఆయా వ్యక్తులకు వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ చేస్తారు. సీబీఐ, ఆదాయ పన్ను, కస్టమ్స్ అధికారుల్లా నటించి సదరు వ్యక్తులని ఫోన్‌లోనే బెదిరిస్తారు. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మనీలాండరింగ్, పన్ను ఎగ్గొట్టడం, డ్రగ్స్ రవాణా లాంటి కేసులో బుక్ అయ్యారని, అందులో మీ పేరు లేదా అడ్రస్ ఉందని అంటారు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని భయపెడతారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
ఈ కేసులో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు కోరతారు లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పెద్ద మొత్తంలో మీ తరపున హామీగా డబ్బు డిపాజిట్ చేయాలని, కేసు దర్యాప్తు పూర్తయ్యాక దాన్ని తిరిగి ఇచ్చేస్తామని అంటారు. సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో చాలామంది ఈ ట్రాప్‌లో పడిపోతుంటారు.
ఇలా జరగడానికి ప్రధాన కారణం.. మనం అనధికారిక సైట్లలోకి వెళ్లినప్పుడు మన వివరాలు వాళ్లకు చేరిపోతాయి. తర్వాత మనకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరిస్తారు. హీరో నాగార్జున కూడా తమ కుటుంబంలోని ఓ వ్యక్తికి ఇలా జరిగిందని చెప్పడం షాకిచ్చింది.
(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఈవారం బిగ్ బాస్ నామినేషన్స్)


