టైటిల్: సఃకుటుంబానాం
నటీనటులు..: రామ్ కిరణ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకుడు..: ఉదయ్ శర్మ
నిర్మాతలు..: మహదేవ్ గౌడ్, నాగరత్న
విడుదల తేదీ..: జనవరి 01, 2026
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన తాజా చిత్రం సకుటుంబానాం. ఉదయ్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (రామ్ కిరణ్) తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అతనిది ప్రశాంతమైన జీవితం.. మంచి జీతం. అయితే ఒక అమ్మాయి తన టీమ్‌లో చేరడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అలా ఆమెను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ ఆమె రాకతో కుటుంబంలో వచ్చే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత బయటపడే రహస్యాలు.. అతని జీవితంలో వచ్చే పరివర్తనలు ఏంటి? చివరికి కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంటుందా? అసలు అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కుటుంబ విలువలను, విభేదాలను ఎలా సమతుల్యం చేయాలో దర్శకుడు చూపించాడు. అవీ కుటుంబ బంధాలను ఎంత బలోపేతం చేస్తాయో ఈ కథలో మేసేజ్ ఇచ్చాడు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన సకుటుంబానాం టైటిల్ తగ్గట్టుగానే కథను ఎంచుకున్నారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ ఉద్యోగం, ప్రేమ చుట్టే కథ తిరుగుతుంది.
ఇక సెకండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టే స్టోరీని నడిపించాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ రోటీన్‌గా అనిపిస్తాయి. ప్రేక్షకుడి బోర్ కొట్టించేలా కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. కథ పరంగా డైరెక్టర్ తన విజన్‌కు తగినట్లుగానే తెరకెక్కించాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను ప్రేక్షకుడికి వివరించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సరికొత్త కథాంశంతో వెండితెరను అలరించడంలో దర్శకుడు ఉదయ్ శర్మ విజయవంతమయ్యాడు. ఓవరాల్‌గా చూస్తే కుటుంబ సమేతంగా చూడదగిన అద్భుత చిత్రమే సకుటుంబానాం.
ఎవరెలా చేశారంటే..
హీరోగా పరిచయమైన రామ్ కిరణ్ తన డ్యాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మేఘ ఆకాష్ తనదైన నటనతో అదరగొట్టేసింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో జీవించేశాడు. బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్ మధు దాసరి పనితీరు బాగుంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు, నృత్యాలు సినిమాకు పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. శశాంక్ మలి తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది.
రేటింగ్ : 2.5 /5


