మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన యోగిబాబు ఇప్పుడు బిజీ నటుడు. కమెడియన్ గానే కాకుండా హీరోగాను నటిస్తున్నారు. కోలీవుడ్‌లో యోగిబాబు లేని చిత్రం ప్రస్తుతకాలంలో లేదనే చెప్పవచ్చు. కాగా ఈయన నటిస్తున్న 300వ చిత్రానికి అర్జునన్ పేర్ పత్తు(Arjunan Peru Paththu) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు విజయ్ సేతుపతి ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. దేవ్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి తంగపాండి, ఎస్ కృతిక తంగ పాండి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆర్.రాజమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే ఆనందాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు.
ఇది ఇంతకుముందు యోగిబాబు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పాత వాహనాల విక్రయాల్లో జరిగే మోసాలను, తద్వారా గురయ్యే ప్రజల బాధలను ఆశ్రయించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. అదేవిధంగా ఇకపై పాత వాహనాల క్రయ విక్రయాలపై అవగాహన కలిగించే విధంగా, వాస్తవ ఘటనలతో రూపొందిస్తున్న చిత్రం అర్జునన్ పేర్ పత్తు అని చెప్పారు. ఇది అన్ని వర్గాలను ప్రేక్షకులను అలరింపజేసే చిత్రంగా ఉంటుందన్నారు.
ఈ చిత్రం ద్వారా నటి అనామిక మహి నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు కాళీ వెంకట్, అరుళ్ దాస్, అయిలి మదన్ ,ఎస్ సుబ్రహ్మణ్యం శివ, మైనర్ నందిని, సౌందర్య, సెన్ డ్రాయన్ ,హలో కందస్వామి, పావ లక్ష్మణ్, రంజన్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటూ దర్శకుడు లెనిన్ భారతి కీలకపాత్రలో నటిస్తున్నారు. చిత్ర షూటింగును చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని, ప్రదీప్ కాళీరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రం ట్రైలర్, ఆడియో విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.


