ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రవిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రవి అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. అందరూ అదే నిజమనుకున్నారు.
కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని టాక్. అంతేకాకుండా అతను 2022లోనే ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ సిటిజన్‌షిప్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా.. 2022 నుంచి కరేబియన్ దీవుల్లోనే నివాముంటున్నారు.
అయితే టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్ అయిన ఇమ్మడి రవి.. పైరసీ సైట్ ఐ బొమ్మను స్థాపించాడు. దాదాపు కొన్ని వేల సినిమాలను ఐ బొమ్మ ద్వారా అందుబాటులో ఉంచాడు. ఓటీటీ కంటెంట్‌ను డీఆర్‌ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్‌డీ ఫార్మాట్‌లోకి మార్చి ఐబొమ్మ సైట్‌లో అప్‌లోడ్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.


