సాక్షి హైదరాబాద్ : సినీ పైరసీకేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీ విధించింది. రవిని మూడురోజుల పాటు కస్టడీలో విచారించాలని దానికి అనుమతివ్వాలని పోలీసులు కోరగా కోర్టు అనుమతులిచ్చింది. దీంతో రేపు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు కేసుల్లో రవిని పోలీసులు విచారించనున్నారు. అనంతరం సోమవారం బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.
కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి అలియాస్ (ఇమ్మడి రవి) పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. తొలుత ఒక కేసులో రవిని అరెస్టు చేసి ఓ సారి కస్టడీకి తీసుకుని మరోసారి కస్టడీ పొడిగించుకున్నారు. అనంతరం మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఈ విధంగానే చేశారు.
అనంతరం మిగిలిన మూడు కేసుల్లోనూ ఈ విధంగానే ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం ఐబొమ్మ రవి సినీ పైరసీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రెస్టారెంట్ బిజినెస్ పెట్టే ఆలోచనలో రవి ఉన్నట్లు వారు పేర్కొన్నారు.


