పూర్తిగా కోలుకొని కెప్టెన్ శుబ్‌మన్ గిల్
గువాహటి: భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎలాగైనా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే మెడనొప్పి నుంచి పూర్తిగా కోలుకోని అతను ఈ మ్యాచ్‌లో ఆడటం సందేహంగానే ఉంది. బుధవారం జట్టు సభ్యులతో పాటు గిల్ కూడా గువాహటికి వెళ్లాడు. గిల్ ఆరోగ్య స్థితిపై బీసీసీఐ ఒక ప్రకటన జారీ చేసింది.
‘కోల్‌కతా టెస్టు రెండో రోజు గిల్ మెడకు గాయం కాగా అదే రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాం. తర్వాతి రోజు కొంత కోలుకొని అతను డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ప్రస్తుతం అతని గాయాన్ని బోర్డు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని బట్టి వైద్య బృందం సూచన మేరకే గువాహటి టెస్టులో ఆడించాలా లేదా అని నిర్ణయిస్తాం’ అని బోర్డు వెల్లడించింది.
తాజా స్థితిని బట్టి చూస్తే అతను ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా టెస్టు మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ లేదని సమాచారం. అతను అన్ని రకాలుగా కోలుకొని మైదానంలోకి వచ్చేందుకు కనీసం 10 రోజుల సమయం పట్టవచ్చు. రెండో టెస్టుతో పాటు వన్డే, టి20 సిరీస్‌ల నుంచి కూడా తప్పుకొని విశ్రాంతి తీసుకుంటే మంచిదని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వన్డే సిరీస్‌కు బుమ్రా, పాండ్యా దూరం!
పని భారం తగ్గించడంలో భాగంగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్‌కు దూరమైన పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
త్వరలోనే టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో వన్డేలకంటే టి20లకే ప్రాధాన్యతనివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరమై ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫిట్‌నెస్ నిరూపించుకొని పాండ్యా టి20లు ఆడే అవకాశం ఉంది. ఇదే కారణంగా ప్రధాన పేసర్ బుమ్రాకు కూడా విరామం ఇవ్వవచ్చు.


