సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్.. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రీన్, వెబ్‌స్టెర్‌తో కలిసి స్కోర్ బోర్డును అతడు పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో స్మిత్ 165 బంతుల్లోనే తన 37వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్మిత్ 129 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. స్మిత్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావెస్ హెడ్(163) కూడా భారీ శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు సాధించింది. కంగారులు ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో శతక్కొట్టిన స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వరల్డ్ రికార్డు బ్రేక్..
అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఇంగ్లండ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మిత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్మిత్ ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(5,028) అధిగమించాడు. స్మిత్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్‌లు కలిపి 5,085 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 5085 పరుగులు
డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) - 5028 పరుగులు
అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 4850 పరుగులు
వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) - 4488 పరుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 4141 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) - 4036 పరుగులు
సచిన్ టెండూల్కర్ (భారత్) - 3990 పరుగులు
👉అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆరో స్ధానానికి స్మిత్ ఎగబాకాడు. ఈ జాబితాలో స్మిత్ కంటే ముందు సంగక్కర(38), జో రూట్(41), పాంటింగ్(41), కల్లిస్(45), సచిన్ టెండూల్కర్(51) ఉన్నారు.


