దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో చెలరేగిపోతున్నారు. వీరిలో వార్నర్ అయితే మరీనూ. ఈ ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
గడిచిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో (130 నాటౌట్, 67 నాటౌట్, 82, 110 నాటౌట్) పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. తాజా సెంచరీతో వార్నర్ భాయ్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రిస్ గేల్ (22), బాబర్ ఆజమ్ (11) తర్వాత రెండంకెల సెంచరీ మార్కును (10) తాకిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
మరో ఆసీస్ వెటరన్, టెస్ట్ ప్లేయర్‌గా ముద్ర పడిన స్టీవ్ స్మిత్ అయితే ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్‌లో అద్భుత శతకం బాదిన అతను.. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో అదిరిపోయే విధ్వంసకర శతకం బాదాడు. వార్నర్ తాజా సెంచరీ చేసిన మ్యాచ్‌లోనే స్టీవ్ కూడా శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ గురించి అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ సాటిరాని విధంగా టెస్ట్‌ల్లో వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు. గత ఐదేళ్లలో అతను టెస్ట్‌ల్లో ఏకంగా 24 సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ మూడు శతకాలు చేశాడు. తాజాగా అతను ఆస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలతో సత్తా చాటాడు.
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం లేటు వయసులో ఇరగదీస్తున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వయసుతో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సహా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన రోహిత్.. సౌతాఫ్రికాపై 2, ఆస్ట్రేలియాపై మరో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
విరాట్ కోహ్లి విషయానికొస్తే.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇతను, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చాలామంది విరాట్ పని అయిపోయిందని కూడా అనుకున్నారు. ఈ దశలో విరాట్ అనూహ్యంగా పుంజుకొని సెంచరీల మీద సెంచరీలు బాదుతూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటి విరాట్‌ను గుర్తు చేస్తున్నాడు. విరాట్ గత 8 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీలు చేసి అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
వీరే కాకుండా ఫాబ్ ఫోర్‌లోని మరో వెటరన్ స్టార్ కేన్ విలియమ్సన్ కూడా అడపాదడపా సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో వీరంతా సత్తా చాటుతుంటే, బౌలింగ్‌లో ఒక్కరు మాత్రం ఊహకందని విధంగా చెలరేగిపోతున్నారు. ఆ స్టార్ వెటరన్ బౌలర్ పేరు మిచెల్ స్టార్క్. స్టార్క్ తాజాగా ముగిసిన యాషెస్ 2025-26లో 5 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టి, కుర్ర పేసర్లు కూడా సాధ్యం కాని ప్రదర్శనలు చేశాడు. ఈ సిరీస్‌లో అతను బ్యాట్‌తోనూ ఆకట్టుకోవడం మరో విశేషం.
ప్రస్తుతం జో రూట్ వయసు 35, మిచెల్ స్టార్క్ వయసు 35, స్టీవ్ స్మిత్ వయసు 36, విరాట్ కోహ్లి వయసు 37, రోహిత్ శర్మ వయసు 38, డేవిడ్ వార్నర్ వయసు 39. వీరంతా మహా అయితే కెరీర్‌ను మరో రెండేళ్లు కొనసాగించగలరు. ఇలాంటి దశలో సాధారణ ఆటగాళ్లైతే అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపించే వాళ్లు. కానీ వీళ్లు మాత్రం అలా కాదు. వైన్ వయసు పెరిగే కొద్ది మత్తు ఎక్కువగా ఇస్తుందన్నట్టు సత్తా చాటుతున్నారు.


