పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా- పాక్ మధ్య శుక్రవారం జరిగింది చారిటీ మ్యాచ్ కాదని.. అదొక ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటూ చురకలు అంటించాడు. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని స్పష్టం చేశాడు.
కాగా మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన పాకిస్తాన్ జట్టు తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును చిత్తు చేసిన పాక్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది.
రనౌట్‌పై వివాదం
ఇదిలా ఉంటే.. పాక్ బ్యాటర్ సల్మాన్ ఆఘా రనౌట్ (Salman Agha's run-out)పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మొహ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్‌కు బంతి తాకింది. అప్పటికే క్రీజును వీడిన అతడు బంతి అందుకుని మిరాజ్‌కు ఇచ్చే ప్రయత్నం చేయగా.. వేగంగా స్పందించిన మిరాజ్ బంతిని వికెట్లకు గిరాటేశాడు.
మాటల యుద్ధం
ఈ క్రమంలో బంగ్లాదేశ్ రనౌట్‌కు అప్పీలు చేయగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన సల్మాన్ హెల్మెట్‌ను నేలకేసి కొట్టి అసంతృప్తి వెళ్లగక్కాడు. మిరాజ్‌తో కాసేపు మాటల యుద్ధం చేశాడు. ఇంతలో లిటన్ దాస్ జోక్యంచేసుకోగా.. రిజ్వాన్ అతడిని సముదాయించి పక్కకు తీసుకువెళ్లాడు.
క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని
అయితే, సల్మాన్ రనౌట్ అయిన విషయంపై పాక్ జట్టు, మాజీ క్రికెటర్లు రాద్దాంతం చేస్తున్నారు. సల్మాన్ ఆఘా మిరాజ్ స్థానంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదన్నాడు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అన్నాడు.
ఇక పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ‘‘నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ చేసింది సరైందే కావచ్చు. కానీ క్రీడాస్ఫూర్తికి వారు భంగం కలిగించారు. బ్యాటర్ బౌలర్‌కు సాయం చేద్దామని చూశాడు. కానీ అతడు తనని రనౌట్ చేస్తాడని ఊహించలేదు’’ అని మిరాజ్ తీరును విమర్శించాడు.
ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదు
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ స్పందిస్తూ.. ‘‘ముందుగా అందరికీ ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదు. ఇదొక అంతర్జాతీయ మ్యాచ్.
క్రీడాస్ఫూర్తికి భంగమా?
నిబంధనలకు అనుగుణంగానే మేము రనౌట్ చేశాము. ఇందులో క్రీడాస్ఫూర్తికి భంగం కలిగినట్లు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, మైదానంలో ఆటగాళ్లుగా అది అవుట్ అంటే అవుటేనని మా అందరికీ తెలుసు’’ అని పాక్ క్రికెటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
కాగా ఢాకాలో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (31), మాజ్ సదాకత్ (75)లతో పాటు రిజ్వాన్ (44), సల్మాన్ ఆఘా (64) రాణించారు. దీంతో 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసి పాక్ ఆలౌట్ అయింది.
బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ మిరాజ్ రెండు, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నహీద్ రాణా తలా ఒక వికెట్ తీశారు. ఇక వర్షం వల్ల బంగ్లా టార్గెట్‌ను డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించగా.. 23.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
చదవండి: SRH: బెస్ట్ ప్లేయింగ్ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!
Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz
— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026


