బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో తాను అవుటైన విధానంపై పాకిస్తాన్ క్రికెటర్ సల్మాన్ ఆఘా స్పందించాడు. ఆ సమయంలో తాను గందరగోళంలో పడిపోయానని.. అంతలో మెహిదీ హసన్ మిరాజ్ మాత్రం తనను రనౌట్ చేసేందుకే మొగ్గుచూపాడని పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మైదానంలోవాగ్యుద్ధం నడిచిందన్నాడు.
అసలు విషయం ఏమిటంటే.. మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లా గెలవగా.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో పాక్ జయభేరి మోగించింది.
ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ 39వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి క్రీజులో ఉన్న మొహ్మద్ రిజ్వాన్ మిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అది నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ ఆఘా ప్యాడ్‌కు తగిలి కింద పడింది.
రనౌట్‌కు అప్పీలు
ఈ క్రమంలో బంతి కోసం వచ్చిన మిరాజ్- సల్మాన్‌ను ఢీకొట్టగా.. బంతిని తీసి మిరాజ్‌కు ఇచ్చే ప్రయత్నం చేశాడు సల్మాన్. అప్పటికి అతడు క్రీజు బయటే ఉండటం గమనించిన మిరాజ్ బంతిని అందుకుని స్టంప్స్‌కు గిరాటేసి.. రనౌట్‌కు అప్పీలు చేశాడు.
ఇందుకు అంపైర్ నుంచి సానుకూల ఫలితంగా వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సల్మాన్ మిరాజ్‌తో గొడవపడ్డాడు. ఇంతలో లిటన్ దాస్ కూడా మిరాజ్‌కు మద్దతుగా రాగా.. రిజ్వాన్ అతడిని శాంతింపజేశాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా మిరాజ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు.. టెక్నికల్‌గా మిరాజ్ చేసింది సరైందేనని మరికొందరు వాదిస్తున్నారు. ఈ పరిణామాలపై సల్మాన్ ఆఘా స్వయంగా స్పందించాడు.
Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz
— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
అలా రనౌట్ చేస్తాడనుకోలేదు
‘‘అతడు చేసింది నిబంధనల ప్రకారం సరైందే. ఆ సమయంలో అతడు తాను సరైంది అనుకున్న పనే చేశాడు. నేనే కాస్త భిన్నంగా ప్రవర్తించాల్సింది. గతంలో నేను ఇప్పుడూ ఇలా చేయలేదు. ఇకముందు కూడా చేయను.
నిజానికి బంతి నా ప్యాడ్‌ను తాకి.. తర్వాత బ్యాట్‌కు తాకింది. కాబట్టి అతడు నన్ను రనౌట్ చేయడని భావించా. ముందుగా చెప్పినట్లు బంతి నా ప్యాడ్, బంతిని అప్పటికే తాకింది. అతడికి బంతి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశా. నేనేమీ పరుగు తీయడానికి ప్రయత్నించలేదు.
చెడ్డ మాటలు!..
కానీ అతడు నన్ను రనౌట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో మేమిద్దరం ఒకరినొకరం చాలా మాటలే అనుకున్నాం. అవేమీ మంచి మాటలు కాదు. కోపంలో ఇద్దరం అలా నోరు జారాము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. కాగా బంతి బ్యాటర్ ప్యాడ్ లేదంటే దుస్తుల్లో ఇరుక్కుంటే డెడ్‌బాల్ అవుతుంది.
అలా కాకుండా ప్యాడ్, బ్యాట్‌ను తాకి రోల్ అయితే మాత్రం అది ఇంకా లైవ్‌లోనే ఉన్నట్లు లెక్క. ఈ నిబంధన ప్రకారమే మిరాజ్ సల్మాన్‌ను రనౌట్ చేశాడు. కానీ సల్మాన్ మాత్రం ఆ బంతి డెడ్ అయిందని భావించడం కన్ఫ్యూజన్‌కు దారితీసి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సల్మాన్ హాఫ్ సెంచరీ (64) చేయగా.. మిరాజ్ రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. డీఎల్‌ఎస్ పద్ధతిలో పాక్ బంగ్లాపై 128 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


