ఆటపై ప్రేమ.. అంకితభావం.. నిబద్ధతతో కష్టపడి పైకి వచ్చి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని.. సుదీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగిన ఏ ఆటగాడైనా రిటైర్మెంట్ ప్రకటించే క్షణం తీవ్రమైన భావోద్వేగానికి లోనుకావడం సహజం. అలాంటి తరుణంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సదరు ప్లేయర్ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొంటాడు.
తాను అధిగమించిన సవాళ్లు, ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వారిని గుర్తుచేసుకోవడమూ పరిపాటి. ఆస్ట్రేలియా టెస్టు స్టార్ ఉస్మాన్ ఖవాజా కూడా తన రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రాణంగాప్రేమించిన ఆటకు భారమైన మనసుతో వీడ్కోలు పలికాడు. అయితే, ఆ సమయంలో తాను ఓ బాధితుడినని చెప్పుకొనేందుకే అతడు ప్రాధాన్యం ఇచ్చాడు.
‘‘కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. పాకిస్తాన్‌లో పుట్టడం, ముస్లిం కావడం వల్ల కఠిన పరిస్థితులు దాటాల్సి వచ్చింది. వాటి గురించి ఇప్పుడు చెప్పాలని లేదు.. కానీ.. నేను సాధించగలిగినప్పుడు ఎవరైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నా.
మరో ఉస్మాన్ ఖవాజాకు మళ్లీ ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే నా తాపత్రయం. మనుషులంతా ఒక్కటే అనేది నా అభిమతం. పుట్టిన ప్రాంతంతోనే, లేక మతంతోనో ఎవరినీ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అనేది ఆశల పొదరిల్లు. దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. కష్టపడకుండా ఆ చాన్స్ ఎవరికీ రాదు.
పదిహేనేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. అయినా సమస్య మొత్తం తొలగిపోయిందని చెప్పలేను. నేను నల్లజాతీయుడిని కాబట్టి ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించలేనని విమర్శించేవారు. కానీ నేను అది సాధించాను. ఆటపై నా అంకితభావం, నిబద్ధతను శంకించడం... నా సన్నద్ధతను ప్రశ్నించడంతో చాలా ఇబ్బందిగా అనిపించేది.
అలాంటి సమయంలో కనీస తోడ్పాటు దక్కేది కాదు. జట్టులో ఇతర ఆటగాళ్లు గాయపడితే... కనిపించే సానుభూతి నా విషయానికి వచ్చేసరికి పూర్తి భిన్నంగా ఉండేది. ముస్లింలందరూ మ్యాచ్‌లు ఫిక్స్ చేస్తారు అనుకోవడం తప్పు. ముందు అలాంటి ఆలోచన ధోరణి నుంచి బయట పడాలి. 2023లో పాలస్తీనాపై స్పందించింది కూడా అందుకే.
స్వేచ్ఛ అనేది మానవులందరి హక్కు అని చెప్పాలనుకున్నా. అయితే క్రికెటేతర అంశాలను ప్రస్తావించడం చాలా మందికి నచ్చలేదు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశా. యువతరానికి స్ఫూర్తిగా నిలిచానని అనుకుంటున్నా. ముఖ్యంగా మాకు అవకాశాలు దక్కవు అని నిరాశలో ఉండేవారికి నాకన్నా మంచి ఉదాహరణ ఇంకేముంటుంది’’ అని ఉస్మాన్ ఖవాజా తన రిటైర్మెంట్ ప్రసంగంలో పేర్కొన్నాడు.
మద్దతుగా నిలవలేదా?
అయితే, ఆట గురించి కాకుండా తాను క్రికెటేతర అంశాల గురించి మాట్లాడుతూ రాజకీయాలకు తావిచ్చినా.. ఆసీస్ ఆటగాళ్లు అతడికి మద్దతుగానే నిలిచారు. ఐసీసీ మొట్టికాయలు వేసినపుడు క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి అండగానే ఉంది. డ్రెసింగ్‌రూమ్‌లోనూ అతడి పట్ల ఎవరూ వివక్షపూరితంగా వ్యవహరించిన దాఖలాలు లేవనే చెప్పాలి.

కమిన్స్ గొప్పగానే స్పందించాడే
ముఖ్యంగా షాంపైన్ సెలబ్రేషన్స్‌కు ఖవాజా దూరంగా ఉంటాడని తెలిసి.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒకానొక సందర్భంలో ఎంతో పరిణతి కనబరిచాడు. యాషెస్ సిరీస్‌ను ఆసీస్ 2022లో సొంతం చేసుకున్న తర్వాత.. జట్టంతా ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. ఖవాజా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు.
ఈ విషయాన్ని గమనించిన కమిన్స్.. సహచర ఆటగాళ్లకు షాంపైన్ సెలబ్రేషన్ ఆపమని చెప్పాడు. దీంతో వారంతా మిన్నకుండిపోగా.. కమిన్స్ ఖవాజాను కూడా వేదికపైకి పిలిచి ట్రోఫీని పట్టుకోమని చెప్పాడు. అప్పట్లో కమిన్స్ వ్యవహరించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది.
జన్మభూమి పట్ల ప్రేమ ఉండాలి.. కానీ
కమిన్స్ మనస్ఫూర్తిగా చేసిన పని గురించి ఖవాజాకు తన స్పీచ్ సమయంలో గుర్తుకురాకపోవడం గమనార్హం. తన ప్రసంగం ఆసాంతం తానో బాధితుడినని చెప్పుకొన్న ఖవాజా పదేపదే తను పాకిస్తానీ ముస్లింనంటూ గుర్తుచేసుకున్నాడు. జన్మభూమి పట్ల ప్రేమ ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టరు.
అయితే, బతుకుదెరువు కోసం వచ్చిన చోట అనేక అవాంతరాలు దాటి ఆ దేశ జాతీయ జట్టుకు పదిహేనేళ్లుగా ప్రాతినిథ్యం వహించిన తీరును అతడు పెద్దగా గుర్తుచేసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఖవాజాకు ‘క్యాప్’ ఇవ్వడమే కాదు.. తన ప్రతిభను నిరూపించుకునేందుక చక్కటి వేదిక అందించింది.
సొంత దేశంలో ఉన్నా
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా ప్రోత్సహించింది. ఆటకు సంబంధం లేని రాజకీయాలు మాట్లాడుతున్నా.. భావ ప్రకటనా స్వేచ్ఛకు విలువనిచ్చింది. ఒకవేళ తన సొంత దేశంలో ఉన్నా ఖవాజాకు ఇంత ఫ్రీడమ్ దొరికేది కాదేమో!
అయినా సరే.. అతడు పదే పదే నల్లజాతీయుడినని, పాక్‌కు చెందినవాడినని చెప్పినా.. క్రికెట్ ఆస్ట్రేలియా తప్పుపట్టలేదు. కేవలం అతడిలోని ప్రతిభకు పెద్ద పీట వేసి ఓపెనర్‌గా ఎన్నో అవకాశాలు ఇచ్చింది.
బాధితుడా? కృతజ్నుడా?..
ప్రతి ఆటగాడి కెరీర్‌లో మాదిరే ఫామ్‌లో లేనపుడు ఖవాజా కూడా జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేతప్ప అతడిని కావాలని పక్కనపెట్టినట్లుగా ఎక్కడా అనిపించలేదు. చివరగా.. తన రిటైర్మెంట్ స్పీచ్‌లో ఉస్మాన్ ఖవాజా బాధితుడినని చెప్పుకోవడంలో సఫలీకృతమయ్యాడా? లేదంటే కృతజ్నుడిగా మిగిలిపోయాడా?
ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల బాండీ బీచ్‌లో అమాయక యూదులపై జరిగిన మారణహోమం గురించి మాత్రం ఖవాజా కనీసం స్పందించకపోవడాన్ని కూడా కొంత మంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఏదేమైనా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఉస్మాన్ ఖవాజా.. యాషెస్ సిరీస్‌తో ఏ చోట మొదలుపెట్టాడో... అదే చోట కెరీర్ ముగిస్తున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌తో తన 88వ, ఫేర్‌వెల్ టెస్టు ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో వచ్చి 17 పరుగులే చేసి నిష్క్రమించాడు.
Australia captain Pat Cummins tells players to put away champagne bottles so that Usman Khawaja could celebrate with them.
1.5 years later, Khawaja takes retirement & call his teammates, fans & australians racist as they are of no use to him anymore🤡pic.twitter.com/06gLhaQqiZ— Rajiv (@Rajiv1841) January 4, 2026


