విష్ణు వినోద్ విధ్వంసకర సెంచరీ.. 14 సిక్స్‌లతో వీర విహారం! వీడియో | Vishnu Vinod slams jaw-dropping knock In Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

VHT 2025-26: విష్ణు వినోద్ విధ్వంసకర సెంచరీ.. 14 సిక్స్‌లతో వీర విహారం! వీడియో

Jan 6 2026 7:31 PM | Updated on Jan 6 2026 7:58 PM

Vishnu Vinod slams jaw-dropping knock In Vijay Hazare Trophy

విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో వినోద్ విధ్వంసం సృష్టించాడు. 248 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దు చెలరేగాడు. ఈ క్రమంలో అతడు కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

32 ఏళ్ల విష్ణు వినోద్ సెంచరీ సాధించాక మరింత చెలరేగిపోయాడు. అతడిని ఆపడం​ ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్‌గా 84 బంతులు ఎదుర్కొన్న వినోద్‌.. 13 ఫోర్లు, 14 సిక్స్‌లతో  162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు బాబా అపరాజిత్‌(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా లక్ష్యాన్ని కేరళ రెండు వికెట్లు కోల్పోయి కేవలం 29 ఓవర్లలోనే చేధించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 47.4 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. అజయ్‌ రోహరా(53), జశ్వంత్‌(57) హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. మిగితా ప్లేయర్లంతా విఫలమయ్యారు. కేరళ బౌలర్లలో నిదేష్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఈడెన్‌ యాపిల్‌ టామ్‌, అనికేత్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే కేరళ స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మాత్రం విఫలమయ్యాడు.

గైక్వాడ్ రికార్డు బ్రేక్‌..
ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వినోద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన రెండో ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో వినోద్ ఇప్పటివరకు 106 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు రుతురాజ్ గైక్వాడ్(105) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గైక్వాడ్‌ను వినోద్ అధిగమించాడు. ఈ జాబితాలో కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే(108) అగ్రస్ధానంలో ఉన్నాడు. విష్ణు వినోద్‌ ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆడనున్నాడు.

విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్లు వీరే..

1 - మనీష్ పాండే: 99 ఇన్నింగ్స్‌లలో 108 సిక్సులు

2 - విష్ణు వినోద్: 53 ఇన్నింగ్స్‌లలో 106 సిక్సులు

3 - రుతురాజ్ గైక్వాడ్: 55 ఇన్నింగ్స్‌లలో 105 సిక్సులు

4 - యూసుఫ్ పఠాన్: 56 ఇన్నింగ్స్‌లలో 91 సిక్సులు

5 - ఇషాన్ కిషన్: 50 ఇన్నింగ్స్‌లలో 85 సిక్సులు
చదవండి: బంగ్లాదేశ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement