బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ బ్యాన్ దగ్గర నుంచి, టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు భారత్‌కు రాబోమని చెప్పడం వరకూ చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు తమ అంపైర్లను పంపకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న బంగ్లా అంపైర్‌లు షర్ఫుద్దౌలా, షాహిద్ సైకత్ ప్రపంచకప్‌లో పాల్గోనడంపై సందిగ్ధత నెలకొంది. అయితే వీరిద్దరూ ఐసీసీ ప్యానెల్‌లో ఉన్నందున తుది నిర్ణయం మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకోనుంది.
రగిలిపోతున్న బంగ్లా..
ఐపీఎల్‌నుంచి తమ దేశం ఆటగాడు ముస్తఫిజుర్ రెహ్మన్‌ను అనూహ్యంగా తప్పించడాన్ని బంగ్లాదేశ్ ఘోర అవమానంగా భావిస్తోంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ శనివారం ఐసీసీకి విజ్ఞప్తి చేసిన బంగ్లాదేశ్... తర్వాతి రోజే ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. ఇప్పుడు అంపైర్‌లను కూడా భారత్‌కు పంపకూడదన్న యోచనలో బంగ్లా ఉంది.
చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు


