విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయ భేరి మ్రోగించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ అమన్ రావు అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు గహ్లాట్ రాహుల్ సింగ్(65), కెప్టెన్ తిలక్ వర్మ (34) రాణించారు. బెంగాల్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు.
నిప్పులు చెరిగిన సిరాజ్..
అనంతరం 353 పరుగుల భారీ లక్ష్య చేధనలో బెంగాల్ జట్టు 44.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్ ఒంటరి పోరాటం చేశాడు. షాబాజ్113 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ ఆడుతున్న హైదరాబాదీ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు.
సిరాజ్ మియా తన 10 ఓవర్ల కోటాలో 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు నితేష్ రెడ్డి రెండు, సీవీ మిలంద్, రక్షణ్, నితిన్ తలా వికెట్ సాధించారు. కాగా హైదరాబాద్ ప్రస్తుతం గ్రూపు-బి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉంది. హైదరాబాద్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారీ విజయాన్ని అందుకోవాలి. అంతేకాకుండా మిగితా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
చదవండి: ఐపీఎల్ నుంచి ఔట్.. ముస్తాఫిజుర్‌కు పరిహారం అందుతుందా?


