బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అతడు కూడా ఆడకుండా బీసీసీఐ నిషేదం విధించింది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అతడిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
తమ దేశ క్రికెటర్‌ను అర్ధాంతరంగా తప్పించడాన్ని బంగ్లా జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలో భద్రతను కారణంగా చూపుతూ టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనేందుకు భారత్‌కు వెళ్లబోము అని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఆ లేఖలో బీసీబీ రాసుకొచ్చింది. అయితే బీసీబీ అభ్యర్ధను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది.
భారీ ధరకు అమ్ముడైనా..
అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ అనుహ్యంగా జట్టు నుంచి రిలీజ్ చేయడంతో అతడికి ఏమైనా పరిహరం చెల్లిస్తుందా? అన్న ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాము. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. కాంట్రాక్ట్ పొందిన ఆటగాడికి సదురు ఫ్రాంచైజీకి ఇన్సూరెన్స్ చేయిస్తోంది.
ఒక జట్టులో చేరిన తర్వాత లేదా టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో గాయపడితే భీమా వర్తిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు సదరు ఆటగాడికి ఏభై శాతం వరకు జీతాన్ని చెల్లిస్తాయి. కానీ ముస్తాఫిజుర్ పరిస్థితి అందుకు భిన్నం. అతడు ఇంకా కేకేఆర్ క్యాంపులోనే చేరలేదు. దౌత్యపరమైన కారణాల వద్ద అతడి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. రాజకీయ ఉద్రిక్తతలు, బోర్డు ఆదేశాలు వంటివి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు. కాబట్టి కేకేఆర్ యాజమాన్యం నుంచి అతడికి ఒక్క పైసా కూడా అందదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
అదొక్కటే మార్గం..
అయితే చట్టపరంగా పోరాడటం ఒక్కటే ముస్తాఫిజుర్ రెహమాన్ ముందున్న మార్గం. ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు భారత చట్టపరిధిలోకి వస్తుంది. కానీ ఏ విదేశీ క్రికెటర్ భారత కోర్టులలో గానీ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ (CAS)లో కేసు వేసే అంత సహసం చేయరు. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ.
చదవండి: బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!


