న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేశాడు | Indias squad for New Zealand ODIs announced | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేశాడు

Jan 3 2026 4:54 PM | Updated on Jan 3 2026 5:44 PM

Indias squad for New Zealand ODIs announced

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన‌ భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ శ‌నివారం ప్ర‌క‌టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అయితే అయ్యర్ ఇంకా బీసీసీఐ వైద్యబృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాల్సింది. 

జనవరి 6 న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున శ్రేయస్ ఆడనున్నాడు. దీంతో అతడు ఫిట్‌నెస్ లెవల్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. అతడు ఎటువంటి సమస్య లేకుండా ఆడితే కివీస్‌తో వన్డే సిరీస్‌లో కూడా భాగం కానున్నాడు. ఒకవేళ ఈ ముంబై బ్యాటర్‌కు ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లనున్నాడు.

రుతురాజ్‌పై వేటు..
ఇక అయ్యర్ రీ ఎంట్రీతో మహారాష్ట్ర కెప్టెన్, స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో  గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో స‌త్తాచాటిన‌ప్ప‌టికి.. జట్టు కూర్పు దృష్ట్యా అతడిని సెలక్టర్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక టీ20 ప్రపంచకప్‌-2026ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. దీంతో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్‌, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణాలతో కూడిన పేస్ దళాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.

షమీకి నో ఛాన్స్‌..
ఇక​ దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. అతడిని కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికి.. సెలక్టర్లు మాత్రం మొగ్గు చూపలేదు. షమీ గతేడాది మార్చి నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు.

పంత్‌కే ఓటు..
అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నారని వార్తలకు సెలక్టర్లు చెక్ పెట్టారు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేశారు. అతడిని తప్పించి ఇషాన్ కిషన్‌కు చోటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం పంత్‌కే ఓటేశారు. కేఎల్ రాహుల్ బ్యాకప్‌గా పంత్ ఉండనున్నాడు. హార్దిక్‌ పాండ్యా గైర్హాజరీలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి చోటు దక్కింది. ఇక కివీస్‌-భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.

కివీస్‌తో వన్డేలకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్‌, అర్ష్‌దీప్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement