గతేడాది అక్టోబరులో ఆస్ట్రేలియాతో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు శుబ్‌మన్ గిల్. టీమిండియా వన్డే సారథి హోదాలో తొలిసారి ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కుడిచేతి వాటం.. కెప్టెన్సీ అరంగేట్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పెర్త్‌లో 10, అడిలైడ్‌లో 9 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచిన గిల్.. సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో 24 పరుగులు చేయగలిగాడు.
అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన వన్డేలకు మాత్రం గిల్ దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా సఫారీలతో మూడు వన్డేలకు అందుబాటులో లేకుండా పోయాడు. అనంతరం ప్రొటిస్ జట్టుతో మూడు టీ20లు ఆడినా.. స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026లో ఆడే భారత జట్టులో స్థానం కోల్పోయాడు.
‘రీఎంట్రీ’లో అట్టర్‌ఫ్లాప్
ఈ క్రమంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సందర్భంగా మంగళవారం నాటి మ్యాచ్‌తో ‘వన్డే’లలో రీఎంట్రీ ఇచ్చాడు గిల్. గోవాతో మ్యాచ్‌లో సొంత జట్టు పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గిల్ విఫలమయ్యాడు.

11 పరుగులే చేసి
మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ టీమిండియా కెప్టెన్.. రెండు ఫోర్లు బాది కేవలం 11 పరుగులే చేసి నిష్క్రమించాడు. గోవా పేసర్ వాసుకి కౌశిక్ బౌలింగ్‌లో ప్రభుదేశాయికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్, పంజాబ్ సారథి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) కూడా విఫలమయ్యాడు. కౌశిక్ బౌలింగ్‌లో అతడు బౌల్డ్ అయ్యాడు.
టార్గెట్ 212
ఇలాంటి పరిస్థితిలో వన్‌డౌన్ బ్యాటర్ హర్నూర్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా నమన్ ధిర్ కూడా మెరుగ్గా ఆడుతుండటంతో పంజాబ్ లక్ష్య ఛేదనగా పయనిస్తోంది. రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన గోవా తొలుత బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి తాళలేక 33.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
గోవా బ్యాటర్లలో సూయశ్ ప్రభుదేశాయి (66), లలిత్ యాదవ్ (54) అర్ధ శతకాలతో రాణించారు.పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, సుఖ్‌దీప్ బజ్వా, క్రిష్ భగత్ తలా రెండు వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే మూడు వికెట్లతో చెలరేగాడు. నమన్ ధిర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Update: నమన్ ధిర్ 68 పరుగులతో రాణించగా.. హర్నూర్ సింగ్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా రమణ్‌దీప్ సింగ్ (8 బంతుల్లో 15 నాటౌట్) నిలవగా.. 35 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయిన పంజాబ్.. 212 పరుగులు చేసింది. తద్వారా గోవాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చదవండి: షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు.. కరీంనగర్ కుర్రాడి డబుల్ సెంచరీ


