టెస్టు క్రికెట్‌లో ‘బాజ్‌బాల్’ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ట్రోఫీని ఇంగ్లండ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. యాషెస్ 2025-26లో తొలి మూడు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసిన స్టోక్స్ సేన.. కేవలం 11 రోజుల్లోనే సిరీస్‌ను కోల్పోయింది.
దీంతో ఇంగ్లండ్ జట్టుతో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై విమర్శల వర్షం కురిసింది. అంతేకాకుండా టూర్ మధ్యలో నిర్వహించిన 'నూసా (Noosa)' పర్యటన వంటివి కూడా ఇంగ్లండ్ జట్టు ప్రతిష్టను దెబ్బతీశాయి.
డేంజర్‌లో మెకల్లమ్ పోస్ట్..
అయితే ఆస్ట్రేలియా గడ్డపై ఘోర ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పదవి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మెక్‌కల్లమ్‌కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. జట్టు వాతావరణంతో పాటు సంస్కృతిలో సమూల మార్పులు చేయాలని మెక్‌కల్లమ్‌ను బోర్డు సూచించినట్లు సమాచారం.
ఒకవేళ అందుకు అతడు అంగీకరించకపోతే తనంతట తానుగా రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఈసీబీ కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ ప్రస్తుతం సిడ్నీలోనే ఉన్నారు. ఐదో టెస్టు ముగిసిన వెంటనే జట్టు వైఫల్యాలపై అధికారిక సమీక్ష జరగనుంది. అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్దతు మాత్రం మెక్‌కల్లమ్‌కు ఉంది.
"బ్రెండన్‌తో కలిసి పని చేయడం నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఈ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలమని నమ్ముతున్నాను. ఇప్పుడున్న స్థితిలో జట్టును మెక్‌కల్లమ్ మాత్రమే గట్టెక్కించగలడు" అని స్టోక్స్ సిడ్నీ టెస్టుకు ముందు స్పష్టం చేశాడు. కాగా వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లీష్ జట్టు.. ఎట్టకేలకు బాక్సింగ్ డే టెస్టులో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సిడ్నీ టెస్టు నువ్వానేనా అన్నట్లగా సాగుతోంది.


