ఇంగ్లండ్ క్రికెట్ మొగల్‌గా పేరొందిన, ఆ దేశ క్రికెట్ బోర్డు (ECB) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ కాలియర్ (70) మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణాన్ని ECB ధృవీకరించి, అధికారిక నివాళి అర్పించింది.

ప్రస్తుత ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ.. డేవిడ్ కాలియర్ క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించాని అన్నారు. ఆయన కాలంలో ఆట విస్తృతంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నారు. కాలియర్ నిజమైన జెంటిల్‌మన్, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.
డేవిడ్ కాలియర్ 2004 అక్టోబర్‌లో ECB రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన జమానాలో ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రపంచకప్ డబుల్ (2009లో టీ20 మరియు వన్డే వరల్డ్‌కప్) సాధించింది.
అలాగే పురుషుల జట్టు 2010 టీ20 వరల్డ్‌కప్ సాధించి, తమ ఖాతాలో తొలి ఐసీసీ ట్రోఫీ జమ చేసింది. వీటితో పాటు కాలియర్ హయాంలో ఇంగ్లండ్ పురుషులు, మహిళల జట్లు తొమ్మిది సార్లు (పురుషులు 4, మహిళలు 5) ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి.
ECBలో చేరకముందు కాలియర్ ఇంగ్లండ్ దేశీయ క్రికెట్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్సెక్స్ కౌంటీలో అసిస్టెంట్ సెక్రటరీగా.. గ్లోస్టర్‌షైర్, లీసెస్టర్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్‌లో (1980–2004) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందించారు. కాలియర్ ECB పదవిలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్లు కోల్పోయిన ప్రభను తిరిగి దక్కించుకున్నాయి. అతని మరణం ఇంగ్లండ్ క్రికెట్‌కు పెద్ద లోటుగా భావించబడుతుంది.


