ఇంగ్లండ్ 'బాజ్‌బాల్' వ్యూహం ఆస్ట్రేలియా గడ్డపై బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లీష్ జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై వేటు వేసేందుకు ఈసీబీ సిద్దమైనట్లు సమాచారం.
మెకల్లమ్ కాంట్రాక్ట్‌ను పొడిగించే యోచనలో ఈసీబీ లేదంట. 'ది టెలిగ్రాఫ్' కథనం ప్రకారం.. టీ20 వరల్డ్ కప్-2026 తర్వాత మెక్‌కల్లమ్‌ను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు ఆల్‌ఫార్మాట్ హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. తొలుత కేవలం టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా మాత్రమే కొనసాగిన మెక్‌కల్లమ్.. గతేడాది వైట్‌బాల్ క్రికెట్‌లో ప్రధాన కోచ్ పగ్గాలు చేపట్టాడు.
అయితే మెకల్లమ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆ జట్టు ఆటతీరులో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మెకల్లమ్ అప్పుడే కొత్తగా టెస్టు కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్‌తో కలిసి ‘బాజ్‌బాల్’కు శ్రీకారం చుట్టాడు. ‘బాజ్’ అన్నది మెకల్లమ్ ముద్దుపేరు. టీ20 శైలిలో దూకుడుగా ఆడుతూ టెస్టు క్రికెట్ రూపరేఖలనే ఇంగ్లండ్ మార్చేసింది.
స్టోక్స్-మెకల్లమ్ ద్వయం కొన్నాళ్లపాటు అద్భుతం చేసింది. కానీ నెమ్మదిగా బాజ్‌బాల్‌కు బీటలు పడ్డాయి. ఇంగ్లీష్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఐసీసీ టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిష్టత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ వరుసగా రెండోసారి కోల్పోయింది.
అంతేకాకుండా జట్టు ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ క్రమశిక్షణ కూడా లోపించింది. ఆసీస్ పర్యటన మధ్యలో ఆటగాళ్లు 'నూసా' (Noosa) రిసార్ట్‌కు వెళ్లడం, అక్కడ మితిమీరిన విందు వినోదాల్లో పాల్గొనడం వంటి అంశాలపై కూడా తీవ్ర స్దాయిలో విమర్శలు వచ్చాయి. ఆటగాళ్లకు మెకల్లమ్ అనుసరిస్తున్న తీరు జట్టు క్రమశిక్షణను దెబ్బతీస్తోందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడిని తప్పించేందుకు ఈసీబీ సిద్దమైంది. ఒకవేళ మెక్‌కల్లమ్ స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


