నల్గొండ జిల్లా: నేపాల్ దేశానికి చెందిన యువతిని నకిరేకల్‌కు చెందిన యువకుడు శనివారం నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. వివరాలు.. కేతేపల్లి మండల పరిధిలోని బండపాలెం గ్రామ పంచాయతీకి చెందిన బచ్చుపల్లి భిక్షపతిరావు, సక్కుబాయమ్మ దంపతులు చాలా ఏళ్లుగా నకిరేకల్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుని ఇక్కడే ఉంటున్నారు. వారి కుమారుడు రాజేష్ ఉన్నత చదువులు పూర్తయ్యాక హోటల్ మేనేజ్‌మెంట్ చేసేందుకు ఏడేళ్ల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు.
అక్కడ రాజేష్‌కు హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న నేపాల్‌లోని ఖాట్మాండు ప్రాంతానికి చెందిన సుజీతతప పరిచయం ఏర్పడి ప్రేమగా మారిది. వారిద్దరు కలిసి దుబాయ్‌లో నాలుగేళ్లు పనిచేశాక.. కెనడాకు వెళ్లి అక్కడ మూడేళ్లు కలిసి పనిచేశారు. తిరిగి నకిరేకల్‌కు వచ్చి స్థిరపడాలనుకుని ఇద్దరు కలిసి ఇక్కడకు వచ్చారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల సభ్యులకు తెలపగా వారు పెళ్లికి అంగీకరించారు. దీంతో పెద్దల సమక్షంలో శనివారం నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం నకిరేకల్‌లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో తెలుగు సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. త్వరలో నకిరేకల్‌లోని హోటల్ స్థాపించి ఇక్కడే నివాసముండనున్నట్లు రాజేష్ దంపతులు తెలిపారు.



