సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో గత కొంతకాలంగా విచ్చలవిడిగా సాగుతున్న హనీ ట్రాప్ దందాకు పోలీసులు బ్రేక్ వేశారు. ధనవంతులు, వ్యాపారులను టార్గెట్ చేసి ఉచ్చులో పడేసి నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ప్రధాన సూత్రధారి రాజుకుమార్, స్వప్నతో పాటు కొందరు రౌడీ షీటర్ల సహకారంతో ఈ దందాను నిర్వహిస్తున్నాడు. పట్టణంలో ఉన్న ధనవంతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, పరిచయాలు పెంచి వారిని ఓ ఇంటికి లేదా లాడ్జ్‌కు రప్పించి హనీ ట్రాప్‌లోకి దించేవారు. అనంతరం రహస్యంగా నగ్న వీడియోలు తీసేవారు. వాటిని బయటపెడతామంటూ బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసేవారు.
ఇటీవల మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. బెదిరింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుగా దర్యాప్తు చేపట్టారు. ముఠా కార్యకలాపాలపై నిఘా పెట్టారు. దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన వారి నుంచి మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డులు సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ తరహా బ్లాక్‌మెయిల్ ఘటనలపై ప్రజలు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మెట్‌పల్లి పట్టణంలో కలకలం రేపిన ఈ హనీ ట్రాప్ కేసు, ఇలాంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఇచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


