ఆటో ఎక్కి నేపాల్‌ వెళ్లింది | Chennai auto driver wins Kamla Bhasin Award for gender equality | Sakshi
Sakshi News home page

ఆటో ఎక్కి నేపాల్‌ వెళ్లింది

Dec 4 2025 7:36 AM | Updated on Dec 4 2025 8:00 AM

Chennai auto driver wins Kamla Bhasin Award for gender equality

చెన్నైలో ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్‌గా మారిన మోహన సుందరి (40) ఆ రోజు అనుకొని ఉండదు  ‘కమలా భాసిన్‌  అవార్డ్‌ 2025’ సాధించి ఖాట్మాండు వెళ్లి మరీ దానిని స్వీకరించగలనని.లింగ సమానత్వం కోసం పోరాడేవారికి ఇచ్చే ఈ అవార్డు ఇటీవల మోహన అందుకుంది.

చెన్నైలో మహిళా ఆటోడ్రైవర్ల కోసం ఆమె స్థాపించిన యూనియన్‌   నేడు 400 మంది సభ్యులకు దిశా నిర్దేశం చేస్తోంది. వారంతా తమ సంఘాన్ని ‘ఇరుంబు కొట్టయి’ (ఇనుప కోట) అని పిలుచుకుంటారు.ప్రతి మహిళా కార్మికురాలికి, ఉద్యోగికి ఉండాల్సిన ఇలాంటి నాయకురాలి గురించి కథనం.

‘మాకు ఇప్పటికీ ఆటో స్టాండ్‌ లేదు. మగవాళ్ల ఆటోలకు స్టాండ్స్‌ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకంగా ఆటో స్టాండ్‌ కావాలి. దాని సంగతి చూస్తున్నాం. ఇంకో సమస్య టాయిలెట్స్‌. ప్రస్తుతానికి పెట్రోలు బంకులే దిక్కవుతున్నాయి. రెస్టరెంట్ల వాళ్లు టాయిలెట్స్‌ వాడుకోవడానికి మమ్మల్ని రానివ్వడం లేదు. ఆ సమస్యను భవిష్యత్తులో సాల్వ్‌ చేసుకుంటాం’ అంటోంది మోహన సుందరి కాన్ఫిడెంట్‌గా.

మోహన సుందరి మూడు నాలుగు రోజుల క్రితం ఖాట్మండులో ‘కమలా భాసిన్‌ అవార్డు 2025’ అందుకుని తిరిగి చెన్నైకి చేరుకుంది. ప్రఖ్యాత ఫెమినిస్ట్‌ కమలా భాసిన్‌ మరణానంతరం ఆమె స్మృతిలో భిన్న రంగాల్లో లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్న వారికి ఈ అవార్డులు ఇస్తున్నారు. లక్ష రూపాయల నగదు ఉంటుంది. ‘డ్రైవింగ్‌ ది వరల్డ్‌ టువర్డ్స్‌ జెండర్‌ ఈక్వాలిటీ’ అనే కేటగిరి కింద మోహన సుందరికి  అవార్డు ఇచ్చారు. కారణం చెన్నైలో ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్‌గా మొదలైన ఆమె ప్రయాణం ఇవాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. త్వరలో మోహన సుందరీ, ఇతర మహిళా ఆటోడ్రైవర్ల మీద ‘ఆటో క్వీన్స్‌’ అనే డాక్యుమెంటరీ కూడా విడుదల కానుంది. అది వచ్చాక ఆమె పేరు ఇంకా మార్మోగనుంది.

సింగిల్‌గా పోరాటం
చెన్నై అయినవరంకు చెందిన మోహన సుందరి జీవితంలో అనేక ఆటుపోట్లు తిన్నది. కేవరం 8వ తరగతి చదువుకున్న ఆమె బతకడానికి ఎన్నో మార్గాలు వెతికింది. బ్యూటీ క్లీనిక్, టిఫిన్‌ సెంటర్, చిల్లర అంగడి... అన్నీ దెబ్బ తీశాయి. ఆ సమయంలో ఏనాడో తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ గుర్తుకొచ్చింది. ఆటో నడుపుదాం అని నిశ్చయించుకుంది. ఇది తెలిసి ఇతర మగ ఆటోడ్రైవర్లు చాలా హడలగొట్టారు. ‘చాలా కష్టమైన పని వద్దు’ అన్నారు. కాని మోహన సుందరి ఆగలేదు. ఆటో డ్రైవర్‌గా మారింది. యూనిఫామ్‌ వేసుకొని రోడ్డు మీద ఆమె తిరుగుతుంటే ఆమె ప్రయాణికులను మాత్రమే గమ్యాన్ని చేరుస్తున్నట్టుగా కాక సామాన్య మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఒక మార్గాన్ని చూపుతున్నట్టుగా అందరికీ అనిపించింది. ‘పల్లెల్లో ఆడవాళ్ల దగ్గర డబ్బు ఉండక ఇబ్బంది పడతారు. కాని సిటీల్లో కూడా స్త్రీల దగ్గర డబ్బు ఉండదు. స్త్రీలకు సంపాదన ఉంటే వారిని చూసే పద్ధతి మారుతుంది’ అంటుంది మోహన.

సాటి మహిళలు
చెన్నైలో మోహన సుందరి ఆటో నడిపే సమయానికి చాలా తక్కువమంది మహిళలు డ్రైవర్లుగా ఉన్నారు. కోవిడ్‌ సమయంలో చాలామంది ఉపాధి అతలాకుతలం అయ్యాక కొత్తగా మహిళలు ఈ రంగంలోకి వచ్చారు. ‘చెన్నైలో ప్రస్తుతం 400 మంది మహిళా ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారిలో సగం మంది సింగిల్‌ పేరెంట్స్‌. పిల్లల్ని చూసుకుంటూ సంపాదించాలంటే స్త్రీలకు పెద్ద ఛాలెంజ్‌’ అంటుంది మోహన. వీరంతా మొదలు వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరి నుంచి స్కూలు పిల్లల గిరాకీ ఉందని, ఇక్కడా అక్కడా నెలవారీ గిరాకీలు ఉన్నాయనే సమాచారం ఒకరికొకరు పంచుకోవడం మొదలుపెట్టాక వీరికి పని గ్యారంటీ వచ్చింది. అదీగాక ఆటో ప్రయాణాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు పంచుకోవడం వల్ల సమస్యలు ఎలా సాల్వ్‌ చేసుకోవాలన్న ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ మహిళా ఆటోడ్రైవర్లు ఒక బృందంగా బలపడ్డారు.

ఇనుప కోట
‘ఒక ఆటో డ్రైవర్‌ మరణిస్తే అతని ముసలి తల్లి చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడటం చూశాక మా మహిళా ఆటోడ్రైవర్లకు సంఘం పెట్టాలనిపించింది’ అంది మోహన సుందరి. ఎన్నో తర్జన భర్జనల తర్వాత సరైన పద్ధతిలో గత సంవత్సరం ‘వీర్‌ పెంగళ్‌ మున్నెట్ర సంగం’ (విపిఎంఎస్‌) రిజిస్టర్‌ చేశారు. ఇది పెట్టాక మహిళా ఆటో డ్రైవర్లు సభ్యత్వం తీసుకుని తమ సంఘాన్ని ‘ఇనుప కోట’గా పిలుచుకుంటున్నారు. అంటే ఏ సమస్య వచ్చినా కాచుకునేదన్న మాట. నెల నెలా 200 సంఘానికి డ్రైవర్లు కట్టాల్సి ఉంటుంది. ఆ నిధితో సభ్యుల సంక్షేమానికి వినియోగిస్తోంది మోహన. అవి ఏమిటంటే...

1. పది లక్షల రూపాయలకు ఇన్సూరెన్సు
2. అవసరానికి పది నెలల్లో తీర్చేలా 10 వేల అప్పు
3. అనారోగ్యం వల్ల ఆటో వేయలేకపోతే 5 వేలు సాయం
4. మహిళా ఆటోడ్రైవర్‌ ఇంట వృద్ధులు మరణిస్తే అంతిమ క్రియలకు 10 వేలు సాయం.

ఇవి గాక ఆటో డ్రైవర్లకు ఉండే ఫైనాన్స్‌ సమస్యలు, పిల్లల స్కూలు ఫీజులు, ఇతర సపోర్టు ఈ సంఘం ఇస్తోంది. అందుకే మోహన సుందరి చెన్నై ఆటో క్వీన్‌. ఆమె లాంటి కార్యాచరణ ప్రతి అసంఘటిత రంగంలో ఉంటే మహిళలకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ముందుకెళ్లే ఉపాయాలు దొరుకుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement