ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పట్టభద్రులైన మీ అందరికీ అభినందనలు! నేను నా స్నాతకోత్సవానికి హాజరు కాలేదు. ఎందుకంటే, నేను సన్యాసిని కావాలనుకున్నా. సాధారణంగా, భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చేవారు ఎవరైనా డాక్టరు, లాయరు కావాలను కుంటారు. లేదా దేనికీ కొరగాకుండా పోతారు. అందుకే మా అమ్మా నాన్న నా మానసిక స్థితిపై ఆందోళనపడ్డారు. కానీ, దాన్ని బయటకు కనిపించనీయలేదు. ‘వై వుయ్ మేక్ బ్యాడ్ డెసిషన్స్’ అనే శీర్షికతో డ్యాన్ గిల్బర్ట్ రాసిన పుస్తకాన్ని నాకు పంపించారు. కాకతాళీయంగా, ఆయన కూడా ప్రిన్స్‌టన్ నుంచి పీహెచ్‌డీ చేసినాయనే! కనుక నా జీవితంలో ఒక చక్రభ్రమణం పూర్తయిందనుకుంటున్నాను. మీ విలు వైన కాలానికి తగ్గ విలువైన అంశాలనే చెప్పగలనని ఆశిస్తున్నాను. ఈ ధైర్యం నాకు చిన్నప్పుడు లేదు.
స్వశక్తిపై సందేహాలు సహజమే!
ఎనిమిదేళ్ళ వయసులో మొదటిసారి దీపావళి సందర్భంగా స్కూల్లో స్టేజీ ఎక్కాను. నాతో మాట్లాడించి, పాడించాలని మా అమ్మ ఆశ. నా గొంతు విని అందరూ నవ్వడం మొదలెట్టారు. దాంతో మాటలు మరచిపోయాను. కాగితంలో తర్వాతి వాక్యం చూడాలని ప్రయత్నించాను. కన్నీటి చుక్కలతో అక్షరాలు మసక బారాయి. టీచరు వచ్చి భుజం చుట్టూ చేయి వేసి, స్టేజి మీద నుంచి కిందకు దింపింది.
తర్వాత, ఓ అమ్మాయి నా ప్రేమను తిరస్కరించింది. కొన్ని రోజులు నా బుర్రంతా అదే ఆలోచన. ఆమె నన్ను తిరస్కరించినందుకు కాదు. నా ప్రతిపాదనకు ఆమె ఏమనుకుందోనని నాలో భయం. కాలేజీ చదువు తర్వాత, ఆరామానికి వెళ్ళి భిక్షువుగా మారాను. అమ్మ, నాన్న నా నిర్ణయాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకుంటారా అని ఆందోళన. మూడేళ్ళ తర్వాత, బౌద్ధారామానికి వీడ్కోలు పలికాను. ఫెయిలయ్యానని అనిపించింది. ఉద్యోగాల వేటలో 40 తిరస్కారాలు ఎదురయ్యాయి.
కనీసం ఇంటర్‌వ్యూలకు కూడా పిలవలేదు. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చు కున్నా అదీ పరిస్థితి. చివరకు కన్సల్టెంట్‌గా ఉద్యోగం వెలగబెట్టా. అందులోనూ అందరికన్నా వెనుకబడి ఉన్నానని బాధే. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారోనని ఆదుర్దా. మీడియాలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుదురుగా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టా. నేను పాడ్‌కాస్ట్ మొదలుపెట్టినపుడు, చేయూత నిస్తానన్న ప్రొడక్షన్ కంపెనీ, అది మొదలవడానికి రెండు వారాల ముందే చేతులెత్తేసింది. నేను మొదటి పుస్తకం రాసినపుడు, 14 మంది పబ్లిషర్లు పుస్తకం పేరు మార్చమన్నారు. ఇలాంటివన్నీ ఎదుటివాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారోనన్న ఆందోళనకు గురిచేస్తాయి.
చార్లెస్ హార్టన్ కూలే 1902లో చెప్పిన మాటల సారాంశం చెబు తాను: నేను తెలివైనవాడినని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటే, నేను తెలివైనవాడిగా వ్యవహరించడం ప్రారంభిస్తా! కానీ, పనికిరానివాడినని మీరు నా గురించి అనుకుంటున్నారని, నేను అనుకుంటే, నేను నిజంగానే పనికిరానివాడిగా మారతా!! మన చుట్టూ ఉన్న ప్రపంచం పన్నే ఈ వలలో మనం పడకూడదు. మన రంగాల్లో ఏ పని చేయడానికైనా ఒత్తిడి అనుభవిస్తాం. అవి జనం అంగీకరించేవిగా, ముఖ్యమైనవని భావించేవిగా ఉండాలని కోరుకుంటాం. ఉనికిని చాటుకునేందుకు, ప్రాధాన్యాన్ని నిలుపు కొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. ఎందుకంటే, ప్రపంచం ఆకట్టుకునేదిగా ఉన్నదానివైపే మొగ్గుతుంది. నేను చెప్పేది ఒకటే. మనం కనపడకూడదు.
బుద్ధుడు చెప్పిన పాఠం
అదృశ్యమైపోవడమంటే పని మానేయడం కాదు. పని చేస్తూనే ఉండాలి. కానీ, అది నలుగురికీ కనిపించేలా ఉండనవసరం లేదు. ప్రతి అడుగూ ముందే ప్రకటించాల్సిన అవసరం లేదు. జనం ఏమనుకుంటారోననే ఆలోచనను పక్కన పెట్టండి. మీకు ఏ పని చేయగలమని గట్టి నమ్మకం ఉందో దానికి విలువ నివ్వండి. మీకు ఆనందాన్ని ఇచ్చే దానితో పోలిస్తే, పైకి గొప్పగా కనిపించే లేదా సవ్యమైనదిగా తోచే పని ఏదైనా సరే దిగదుడుపే!
వృత్తి జీవితం మొత్తం ప్రజల కళ్ళెదుట ఆన్‌లైన్‌లో గడిపే వ్యక్తి ఇటువంటి సలహా ఇవ్వడం చోద్యంగా తోచవచ్చు. కానీ, ఒకసారి కాదు రెండు సార్లు అదృశ్యమైన తర్వాతే, నేను ఇప్పుడున్న స్థితికి చేరుకున్నా. మొదటిసారి భిక్షువునయ్యా. రెండవసారి, బౌద్ధ భిక్షు వుల వద్ద నేర్చుకున్న అంశాలను నలుగురికీ పంచేందుకు, కుదు రుగా చేసుకుంటున్న ఉద్యోగాన్ని మానేశా. వ్యవస్థాపక సామర్థ్యం ఉన్న ప్రపంచస్థాయి ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తలు అందరూ తాము ఇష్టపడే వ్యాపకంపై మౌనంగా కృషి చేసినవారే!
ఒకసారి ఓ విద్యార్థి ‘‘ధ్యానం ద్వారా ఏమి పొందుతారు?’’ అని అడిగాడు. ‘‘ఏమీ లేదు’’ అన్నది బుద్ధుడి జవాబు. ‘‘ఇంక ధ్యానం చేయడం దేనికి?’’ అని విద్యార్థి అడిగాడు. ‘‘నేను ఏదో పొందాలని ధ్యానం చేయడం లేదు. ధ్యానం ద్వారా ఆందోళన, అభద్రత, సంశయాలు పోగొట్టుకుంటున్నా’’ అన్నాడు బుద్ధుడు.
ప్రిన్స్‌టన్‌లో పట్టభద్రులవడం ద్వారా మీరు ఏయే ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారో ఊహించుకోవచ్చు. కానీ, మీరు వదిలించుకోవాల్సిన వాటి పట్ల కూడా కొంత ఆసక్తి వహించండి. ఎవరి ఆమోదం కోసమో చూసే అవసరాన్ని పోగొట్టు కోండి. ఎదుటివారితో పోల్చుకోవడమనే చాపల్యాన్ని వదులుకోండి. మన విజయాలను మరొకరి విజయాలతో పోల్చి చూసుకుంటే, మనం సాధించగలిగిన విజయాలు కూడా దెబ్బతింటాయి. మీరు మీ సాఫల్యాన్ని మరొకరితో పోల్చి చూసుకోవడం వల్ల మీకు ఎన్నటికీ అసంతృప్తే మిగులుతుంది.
జీవితాన్ని తీర్చిదిద్దే నిర్ణయాలు
మీరు నమ్మే వ్యక్తుల నుంచి పాఠాలు నేర్చుకోండి. కానీ, ఇత రుల అభిప్రాయాలు ఈ నిర్ణయాలను నిర్వచించకుండా చూసుకోండి. ఎందుకంటే, మనం తీసుకునే నిర్ణయాలకు మనమే బాధ్యు లమవుతాం. మనపై మన స్వీయ అభిప్రాయమే ముఖ్యం. ప్రతి రోజు నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాలి. కొన్ని రోజులు అప్రియమైనవిగా గడుస్తాయి. ఏవేవో పొరపాట్లు చేస్తాం. అప్పుడు నిజాయతీతో కూడిన స్వీయ అభిప్రాయం అవసరం.
పొట్టకూటి కోసం ఏం చేస్తామన్నది మరో ముఖ్య నిర్ణయం అవుతుంది. మీకు ఏది ఇష్టమైన పనో దాన్ని చేయడానికి ప్రయత్నిం చండి. అటువంటి ఉద్యోగం దొరక్కపోతే, చేస్తున్న పనిలోనే పర మార్థాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మన జీవి తంలో మూడవ వంతు సమయాన్ని మనం పని చేస్తున్న చోటే వెచ్చిస్తాం. దాదాపుగా 90,000 గంటలు అను కోవచ్చు. కనుక దాన్ని ద్వేషిస్తూ కూర్చోవద్దు. చేస్తున్న పనిపై మక్కువ పెంచుకునే ప్రయత్నం చెయ్యండి. పని ఇష్టం లేకపోయినా, ఆ పనికి మీరు ఇష్టపడేదేదో కలపండి. అయినా, ఏమాత్రం మన సుకు ఎక్కకపోతే, ఆ భావాన్ని మరో కొత్తదాన్ని ప్రయత్నించి చూడ టానికి ఉత్ప్రేరకంగా వాడుకోండి. 2030 నాటికి ఉండగల ఉద్యోగాల్లో 85 శాతం ఉద్యోగాలు ఇంకా రూపొందనే లేదని చెబుతున్నారు. అంటే, ఏ రకమైన అవకాశాలు తలుపు తడతాయో చెప్పలేం!
మానవాళికి మనం ఏమి చేస్తామన్నది మరో ముఖ్యాంశం. చాలా మంది అసలు దీని గురించే ఆలోచించరు. కానీ, ఈ ప్రశ్నను కనుక పక్కన పెడితే, నిజమైన సంతృప్తికి దారితీసే ఒక అంశాన్ని జార విడుచుకుంటున్నట్లే లెక్క. అది ఎక్కువో, లేదా తక్కువో కావచ్చు. కానీ, మీ సమయం, శక్తి, వనరులు మీ సొంతం కోసమే కాకుండా ఎదుటివారికి వినియోగపడినప్పుడు అవి మరింత అర్థవంతమైనవిగా మారతాయి.


