విశ్లేషణ
వాతావరణ మార్పుపై భారత్ తరఫున (2007–10) ప్రధాన సంప్రదింపులకర్తగా వ్యవహరించిన నాకు దానికి సంబంధించిన పరిణామాలను గమనిస్తూంటే, నిస్పృహ పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. మానవాళి అస్తిత్వానికే ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పును నిరోధించే లక్ష్యాలు నీరుగారుతున్నాయే తప్ప బలపడటం లేదు. బ్రెజిల్‌లోని బెలేమ్‌లో ఇటీవల ముగిసిన ‘కాప్–30’ని సరిగ్గా మదింపు చేయాలంటే, వాతావరణ మార్పు చరిత్ర పాఠాలను ఒక క్రమానుగతిలో ఆకళింపు చేసుకోవాలి.
గట్టి వాగ్దానాలు వట్టి మాటలై..
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో మొదటి చారిత్రక సమావేశం బ్రెజిల్‌లోనే రియో డి జనేరోలో 1992లో జరిగింది. వాతావరణ మార్పును నిరోధించడంలో అందరూ కలసికట్టుగా వ్యవహరించాలనే సంకల్పాన్ని అది వ్యక్తపరచింది. రియో సదస్సులో పాల్గొన్నవారిలో నేనూ ఒకడిని. తర్వాత, కొద్ది ఏళ్ళలోనే అభివృద్ధి చెందిన దేశాల అసలు రంగు బయటపడింది. అమెరికా నేతృత్వంలో అవి ఐరాస దీక్షను భగ్నం చేస్తూ వచ్చాయి.
చట్టబద్ధంగా కట్టుబడి ఉండవలసిన ఒప్పందం కాస్తా, స్వచ్ఛంద ‘ప్రతిజ్ఞ–సమీక్ష’ తంతుగా మారిపోయింది. ఐరాస స్థూల నియమావళికి అనుగుణంగా 1997లో తీర్మానించుకున్న క్యోటో ప్రోటోకాల్‌ను ఏకపక్షంగా మూలన పడేశాయి. ఆ ప్రోటోకాల్ ప్రకారం 37 పారిశ్రామిక దేశాలు తమ గ్రీన్‌హౌస్ వాయువులను నిక్కచ్చిగా తగ్గించుకోవాలి. అవి మాట నిలబెట్టుకుని ఉంటే, మొత్తం ఉద్గారాలలో సగటున 5.2 శాతం తగ్గుదల సాధ్యమయ్యేది. అవి తాము పెట్టుకున్న లక్ష్యాలను మొదటి నిబద్ధతా పరిధి (2008–13)లో సాధించి ఉండవలసింది. ఉద్గారాలను మరింతగా తగ్గించుకోవడంపై చర్చించుకుని, కొత్త లక్ష్యాల సాధనకు రెండవ నిబద్ధతా పరిధి (2014–19)లో ప్రయత్నించి ఉండవలసింది.
ఈ పదేళ్ళ వ్యవధిలో ఉద్గారాలను తగ్గించుకునేందుకు అంగీక రించవలసిన అవసరం లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసేనాటికి, భారాన్ని సమంగా పంచుకోవాలనే సూత్రాన్ని అనుసరించి, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు రెండూ తమ ఉద్గారాలను తగ్గించుకుంటామని మాట ఇచ్చి ఉండేవి. ఇచ్చిన మాటకు తప్పని సరిగా కట్టుబడి ఉండేలా క్యోటో ప్రోటోకాల్‌ను రూపొందించారు. మొదటి నిబద్ధతా కాల పరిధి పూర్తయ్యే సమయానికి ఏ దేశమైనా ఉద్గారాల తగ్గింపు లక్ష్య సాధనలో వెలితిని కనబరిస్తే, ఆ వెలితిని రెండవ నిబద్ధతా కాల పరిధిలో భర్తీ చేయాలి. అంతేకాక, జరిమానా కింద, రెండవ పరిధికి నిర్ణయించిన లక్ష్యానికి, మరో 30 శాతం అదనపు తగ్గింపును జోడించవలసి ఉంటుంది. కానీ ప్రోటోకాల్‌పై సంతకం చేసిన అమెరికా దానికి అధికారికంగా ఆమోదం తెలుప లేదు. కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి పలు పారిశ్రామిక దేశాలు ఆ ఒడంబడికను ఏకపక్షంగా ఉల్లంఘించాయి. ఈ ఉల్లంఘనకు వాటిని జవాబుదారీ ఎందుకు చేయకూడదు?
అటు అమెరికా... ఇటు చైనా
కోపెన్ హ్యాగన్‌లో 2009లో ఒక శిఖరాగ్ర సభ జరిగింది. ఐరాస సదస్సు సూత్రాలను గాలికొదిలేయకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రయత్నించిన బహుశా చివరి సందర్భంగా దాన్ని చెప్పు కోవచ్చు. ముఖ్యంగా భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా (‘బేసిక్’ గ్రూప్) సడలుతున్న నియమాలను కట్టుదిట్టం చేసేందుకు తమవంతు కృషి చేశాయి. కానీ, అవేవీ ఫలించలేదు. నియమాలను విప రీతంగా పలుచన చేసిన ప్యారిస్ ఒప్పందాన్ని 2015లో ఆమోదించారు. అంతకుముందు ‘బేసిక్ గ్రూప్’లో ఉన్న చైనా, దాన్నుంచి బయటకొచ్చి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ మాత్రం ప్యారిస్ ఒప్పందమైనా రూపుదాల్చింది. కానీ, అమెరికా, చైనా అంతర్జాతీయ క్షేమాన్ని పక్కన పెట్టి తమ సంకుచిత ప్రయోజ నాలను కాపాడుకున్నాయని వేరే చెప్పనవసరం లేదు.
అమెరికాతో పోల్చదగిన స్థాయిలో ఉద్గారాలను పెంచుకుంటూ పోయేందుకు చైనాను వదిలేశారు. ‘నియమాలు అందరూ ఉమ్మ డిగా పాటించవలసినవే అయినా బాధ్యతలు, సంబంధిత సామర్థ్యా లను బట్టి వాటిలో తేడాలుంటాయి (సీబీడీఆర్)’ అని ఐరాస ఒప్పందంలో ఒక కీలక సూత్రం ఉంది. ‘దేశ స్థితిగతులకు అనుగుణంగా’ అనే పదాలను జోడించడం ద్వారా చైనా ఆ సూత్రానికి కొత్త భాష్యం చెప్పింది. ఐరాస ఒడంబడికను గడ్డి పరకగా మార్చడంలో, చైనాను తోడుదొంగ చేసుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు సఫల మయ్యాయి. మరోవైపు అమెరికా రెండుసార్లు ప్యారిస్ ఒప్పందం నుంచి బయట కొచ్చింది. వాతావరణ మార్పును ఒక బూటకంగా అది కొట్టిపారేస్తోంది.
ఎవరి ప్రయోజనాలు వారివే!
ఈమధ్యనే బెలేమ్‌లో ముగిసిన కాప్–30ని ‘సత్యం, అమ లు’కు పెద్దపీట వేసినదిగా అభివర్ణిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే, ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న నామమాత్రపు లక్ష్యాలను సాధించ లేదు. వాటి అమలుకు కనీసం ఇప్పుడైనా రంగాన్ని సిద్ధం చేసు కోలేదు. గత ఏడాది (2024) అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు అయింది. పారిశ్రామిక విప్లవం ముందటి స్థాయిలకన్నా 1.55 సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే విడత ప్రపంచ వ్యాప్త సమీక్షకు తాజాగా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమైన ప్పటికీ, ఈ శతాబ్దాంతానికి ఉష్ణోగ్రతలలో 2.5–3 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరుగుదల కనిపించే దిశగా సాగుతున్నాం.
ఉష్ణోగ్రతల్లో 1.5 సెంటిగ్రేడ్ పెరుగుదల కనిపించినా అది ప్రపంచ జీవావరణానికి వినాశకర పర్యవసానాలు సృష్టిస్తుందనీ, ఇక మార్చడానికి వీలులేని గతి ఏర్పడుతుందనీ ఐరాస ప్రత్యేక నివేదిక ఇప్పటికే హెచ్చరించింది. (మనం ఇప్పటికే ఆ ప్రమాద హెచ్చరికను మించి ఉన్నాం. 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, ప్రపంచవ్యాప్త అమలును వేగవంతం చేస్తామని కాప్–30 వాగ్దానం చేసింది. కానీ, ఎలా? ఎవరికి వారే యమునా తీరే రీతిలో ఉన్న ప్రపంచంలో వాతావరణ మార్పు సమస్యకు ప్రాధాన్యం లభిస్తుందనుకోవడం ఒక భ్రమ.

శ్యామ్ శరణ్: వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


