ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై కోలుకోలేని దెబ్బ
మూడు దశాబ్దాల్లో రూ. 2.88 కోట్ల కోట్లు నష్టం
వందల కోట్ల టన్నుల ఆహారోత్పత్తులు నేలపాలు
అత్యధికంగా ప్రభావితమైంది ఆసియాలోనే..
కరువు, వరదలు, తుపాన్లు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి విపత్తులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒక్క భారత్‌కే కాదు ప్రపంచవ్యాప్తంగా రైతన్నలపాలిట ఇవి శాపంగా మారాయి. గడిచిన 33 ఏళ్లలో అంతర్జాతీయంగా ఈ విపత్తులు రూ.2,88,99,900 కోట్ల మేర వ్యవసాయ నష్టాలను కలిగించాయని అంచనా. అంటే ఏటా రూ.8,75,754 కోట్లు. ఇది ప్రపంచ వ్యవసాయ జీడీపీలో దాదాపు 4 శాతం అన్నమాట.
ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వ్యవసాయం, ఆహార భద్రతపై విపత్తుల ప్రభావం–2025 పేరుతో రూపొందించిన కొత్త నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1991–2023 మధ్య విపత్తుల కారణంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ కాలంలో ఊహలకు అందనంతగా 460 కోట్ల టన్నుల తృణధాన్యాలు, 280 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, 90 కోట్ల టన్నుల మాంసం, పాల ఉత్పత్తులు తుడిచిపెట్టుకుపోయాయి.
ఈ నష్టాలు రోజువారీ తలసరి 320 కిలో కేలరీల తగ్గింపునకు దారితీశాయి. అంటే సగటు శక్తి అవసరాల్లో 13–16 శాతం అన్నమాట. ప్రపంచ నష్టాల్లో ఆసియా అత్యధికంగా 47 శాతం వాటాతో ముందు వరుసలో ఉంది. మొత్తం రూ.1,35,82,953 కోట్ల నష్టం మూటగట్టుకుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయం గణనీయమైన వాటాను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఈ నష్టాలు ఆహార భద్రత, గ్రామీణ స్థిరత్వానికి తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి.
మత్స్య సంపద సైతం..
యూఎస్‌ఏ 22 శాతం లేదా రూ.63.5 లక్షల కోట్ల నష్టాలతో రెండవ స్థానంలో ఉంది. తరచూ వచ్చే కరువులు, తుపాన్లు, అలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు ఇందుకు కారణం. రూ.54 లక్షల కోట్ల నష్టంతో ఆఫ్రికా టాప్–3లో చోటు సంపాదించింది. విపత్తుల కారణంగా వ్యవసాయ జీడీపీలో 7.4 శాతం ఆఫ్రికా కోల్పోతోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అతిపెద్ద భారం ఆఫ్రికాకే.
ఫిజీ, మాల్దీవులు, జమైకా, క్యూబా వంటి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ (ఎస్‌ఐడీఎస్) తుపాన్లు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి విపత్తులకు ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో ఒకటిగా ఉన్నాయి. 1985–2022 మధ్య సముద్ర వేడి గాలులు రూ.58,509 కోట్ల నష్టాలను కలిగించాయి. ఇది ప్రపంచ మత్స్య సంపదలో 15 శాతం ప్రభావితం చేసింది. మత్స్య, ఆక్వాకల్చర్ రంగం 50 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి మద్దతు ఇస్తోంది.
విప్లవాత్మక మార్పులు..
కరువులు, వరదలు మొదలుకుని తెగుళ్లు, వేడి గాలుల వరకు.. ఈ ప్రకృతి విపత్తులు ఆహార ఉత్పత్తి, జీవనోపాధి, పోషకాహారాన్ని దెబ్బతీస్తున్నాయి. విపత్తుల వల్ల తలెత్తే సంక్షోభం నుంచి వ్యవసాయ ఆహార వ్యవస్థలను గట్టెక్కించడానికి మాత్రమే డిజిటల్ ఆవిష్కరణలు పరిమితం కాలేదు.
ముందస్తు చర్యలతో డేటా ఆధారిత స్థితిస్థాపకత నిర్మాణానికి మారడంలో సాయపడుతున్నాయి. ప్రమాదాలను పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరికలను అందించడం, రైతులు వేగంగా నిర్ణయం తీసుకోవడంలో డిజిటల్ టెక్నాలజీలు ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని నివేదిక వివరించింది.
గేమ్ చేంజర్‌గా..
వ్యవసాయ విపత్తు ప్రమాదాలను తగ్గించే విషయంలో డిజిటల్ వినియోగం గేమ్ చేంజర్‌గా నిలిచిందని ఎఫ్‌ఏఓ నివేదిక కితాబిచి్చంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), రిమోట్ సెన్సింగ్, మొబైల్ కనెక్టివిటీ, డ్రోన్స్, సెన్సార్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాధనాలు ఇప్పుడు రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వేగంగా అందిస్తున్నాయని తెలిపింది.
ఇవి ముందస్తు హెచ్చరిక, సలహా సేవలు, బీమా, ముందస్తు చర్యలను మెరుగుపరుస్తున్నాయని వెల్లడించింది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (జీఐఈడబ్ల్యూఎస్) వంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పెట్టుబడి పెట్టిన ప్రతి డాలర్‌కు ఏడు డాలర్ల వరకు రాబడిని ఇవ్వగలవని నివేదిక తెలిపింది.


