ఎడతెరపి కురుస్తున్న మంచు
అమితాశ్చర్యంతో సౌదీ ప్రజలు
వాతావరణ మార్పుల విపరిణామాల ఫలితమంటున్న శాస్త్రవేత్తలు
రియాద్: ఎటుచూసినా ఇసుక తిన్నెలు, భగభగమండే భానుడి సెగలు, భరించరాని వేడి, అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా ఎడారుల్లో ఇప్పుడు లెక్కలేనంత మంచు కుప్పలుతెప్పలుగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చలికాలం కావడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టాలకు పడిపోతున్నాయి. దీంతో తమ ఎడారుల్లో మంచు దుప్పట్లు పర్చుకోవడంతో సౌదీ స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి, మరికొంద గందరగోళానికి గురవుతున్నారు.
వాతావరణ మార్పుల విపరిణామాల కారణంగానే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈశాన్య సౌదీలో అత్యధికంగా మంచు కురుస్తోంది. తబుక్ ప్రావిన్స్‌లోని పర్వతాలన్నీ ఇసుకరేణువులపై పడిన మంచుతో దవళవర్ణ శోభను సంతరించుకున్నాయి. జిబేల్ అల్–లావాజ్ పరిధిలో సముద్రమట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని ప్రఖ్యాత ట్రోజెనా ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయింది.
ఎడారి ఓడగా వినతికెక్కిన ఒంటెలన్నీ ఇప్పుడు మంచు చల్లదనాన్ని తెగ ఆస్వాదిస్తున్నాయి. ఎడారి ఇసుకతిన్నెలన్నీ తెలుపురంగులో మిలమిలా మెరిసిపోవడం, ఒంటెల శరీరాల మీదుగా మంచు పేరుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సముద్రమట్టం నుంచి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు ఏకంగా సున్నా డిగ్రీసెల్సియస్‌కు పడిపోవడం విశేషం. పలు రీజియన్లలో వర్షాలు పడటంతో వాటికి చల్లటిగాలులు తోడై ఉష్ణోగ్రతలను కనిష్టాలకు పరిమితంచేస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఇంతటి స్థాయిలో మంచు కురవడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారికావడం గమనార్హం.


