భూతల్లిని కాచే బిడ్డ | Tamilnadu IAS officer Supriya Sahu receives UN highest environmental honour | Sakshi
Sakshi News home page

భూతల్లిని కాచే బిడ్డ

Dec 12 2025 5:33 AM | Updated on Dec 12 2025 5:33 AM

Tamilnadu IAS officer Supriya Sahu receives UN highest environmental honour

ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ను డిసెంబర్‌ 10న నైరోబీలో తమిళనాడు ఐ.ఏ.ఎస్‌. అధికారి సుప్రియా సాహూ అందుకున్నారు. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేయగా వారిలో సుప్రియ ఒకరు. 2002లో ఐ.ఏ.ఎస్‌గా చేరినప్పటి నుంచి నీలగిరి కొండల్లో ఏనుగుల సంరక్షణ, సునామీ పరిష్కారానికి మడ అడవులు పెంచడం, పర్యావరణ రంగంలో అవిశ్రాంత కృషి సుప్రియాకు ఈ అత్యున్నత పురస్కారం తెచ్చి పెట్టాయి. వివరాలు....

సుప్రియా సాహు... ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘యూఎన్‌ ఛాంపియన్స్ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ బుధవారం నైరోబీ (కెన్యా) లో ఆమె అందుకున్న దరిమిలా అంత సమున్నత అవార్డు రావడంలో ఆమె కృషి ఏమిటా అని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. వన్య్రపాణుల సంరక్షణతో సహా భారతదేశంలో కీలకమైన పర్యావరణ సవాళ్లపై ఆమె చూపిన శ్రద్ధ, నాయకత్వ బాధ్యతలకు గుర్తింపుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారని తెలుసుకుని హర్షం వెలిబుచ్చుతున్నారు.

ఏనుగులంటే ఎందుకంత ఇష్టం?
సుప్రియా సాహు ప్రస్తుతం తమిళనాడు అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ మాత్రమే కాదు పర్యావరణం, వాతావరణ మార్పు, అటవీశాఖ విభాగానికి సర్వోన్నత అధికారి కూడా. అటవీ శాఖకు సంబంధించి ఆమె నిర్వహిస్తున్నది కేవలం బాధ్యత కాదనీ స్వాభావికంగానే ఆమె ప్రకృతి రక్షకురాలనీ తెలిసినవారు అంటారు. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ప్రకృతి రమణీయతను చూసి దాని పై మక్కువ పెంచుకున్న సుప్రియ ఆ సమయంలోనే  ఏనుగులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఇష్టం నేటికీ కొనసాగుతోంది. ఆమె ఇన్ స్టా అకౌంట్‌ మొత్తం ఏనుగుల చిత్రాలతో నిండి ఉంటుంది. ఏనుగులంటే ఎందుకంత ఇష్టం అని అడిగితే కష్టాలలో నుంచి బయట పడటం, కుటుంబ బంధాలు నిలబెట్టుకోవడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం ఏనుగుల నుంచి నేర్చుకోవచ్చని అంటారు సుప్రియ.

భూతాపం తగ్గాలని..
ఇటీవల తమిళనాడు ప్రభుత్వ సారథ్యంలో ‘గ్రీన్‌ క్లైమేట్‌ కంపెనీ’ని ప్రవేశపెట్టి తమిళనాడులో ఉన్న, రాబోయే పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండటానికి అవసరమైన అనుసంధానకర్త పాత్రను పోషించేలా రూపొందించారు సుప్రియ. అడవులను రక్షించడం, అక్కడ ప్లాస్టిక్‌ చెత్త వేయకుండా చూడటం, భూతాపం తగ్గే వ్యవస్థలు ఏర్పాటు చేయడం, దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి తమిళనాడు రాష్ట్రమంతా జరిగేలా ఈ వ్యవస్థ ద్వారా చర్యలు చేపట్టారు.

 రాష్ట్రంలో సుమారు 10 కోట్లకు పైగా మొక్కలు నాటడానికి, 65 కొత్త రిజర్వ్‌ ఫారెస్ట్‌లను స్థాపించడానికి ఆమె నాయకత్వం వహించారు. సునామీ సమయంలో మడ అడవులు అలల ధాటిని నిలువరించడం చూసిన సుప్రియ వాటి పెంపుదల కోసం విశేషంగా కృషి చేశారు. ఆమె ఆధ్వర్యంలో మడ అడవులు రెట్టింపు కావడం దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ విషయంగా మారింది. అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఆమె నిధిని సేకరించారు.

1.2 కోట్ల మందికి మేలు
పర్యావరణ పరిరక్షణకు సుప్రియ చూపిన మార్గాలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రకృతికి మేలు చేకూర్చేవిగా ఉండటంతో ఉన్నతాధికారులు ఆమె కృషిని అభినందించారు. ఈ క్రమంలో లక్షలాది హరిత ఉద్యోగాలను ఆమె సృష్టించారు. ఆమె చేసిన పనుల కారణంగా అటవీ విస్తీర్ణం పెరిగి సమారు 1.2 కోట్ల మందికి మేలు జరిగింది. ‘స్థానిక గ్రామాల్లో నాకు మద్దతుగా నిలిచి, మడ అడవులను సొంతంగా శుభ్రం చేయడానికి నాతో కలిసి పని చేస్తున్న ప్రజలే నాకు ప్రేరణ. వారి నుంచి స్ఫూర్తి పొందుతూ ఎంతటి పనైనా చేయగలననిపిస్తోంది’ అని వివరిస్తున్నారు సుప్రియా సాహు.

జంతువులు ప్లాస్టిక్‌ తినడం చూసి..
2002 నుంచి కలెక్టర్‌గా పని చేస్తున్న సుప్రియ తన మొదటి పోస్టింగ్‌ చేస్తున్నప్పటి నుంచి ప్రకృతిని రక్షించేందుకు తాను, తన అధికారం ఏం చేయచ్చా అని తీవ్రంగా ఆలోచించారు. బాధ్యతారహితంగా ప్రవర్తించే మనుషుల వల్లే పర్యావరణానికి తీవ్రమైన నష్టమని ఆమె గుర్తించారు. ‘నీలగిరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో జంతువులు ప్లాస్టిక్, చెత్త తినడం చూశాను. అది చాలా దారుణమైన విషయం అనిపించింది’ అని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు సుప్రియ. వెంటనే ఆమె నీలగిరిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను తొలగించే లక్ష్యంతో ‘ఆపరేషన్‌ బ్లూ మౌంటైన్‌’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్‌ కాలుష్యం గురించి జనానికి పెద్దగా తెలియని సమయంలోనే ఆమె ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరు చేపట్టారు. అంతేకాదు ఏనుగుల సంరక్షణ కేంద్రాలతో పాటు పులులు తిరుగాడేందుకు అడవుల జోన్‌ను విస్తరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement