మన భారతదేశ గుర్తింపు, అభివృద్ధిలో తోడ్పడిన కొందరిని మర్చిపోతుంటాం. ఎవరో గుర్తు చేస్తేగానీ మనం గ్రహించం. అలాంటి మహనీయుల్లో ఒకరు డాక్టర్ జానకి అమ్మళ్. తియ్యదనంతో చెరగని ముద్రవేసి భారత్‌ని ప్రపంచవేదికపై తలెత్తుకునేలా చేశారామె. అలాంటి ప్రముఖ మహిళ చేసిన అచంచలమైన కృషి గురించి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నెట్టింట షేర్ చేశారు. ఈ తరం తప్పక తెలుసుకోవాల్సిన గొప్ప మహిళ ..అలాగే ఆమె సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తి అంటూ జానకి అమ్మల్‌పై ప్రశంసలజల్లు కురిపించారు.
ఆనంద్ మహీంద్రా ఎక్స్ పోస్ట్‌లో జానకి అమ్మల్ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ..ఆమెను ధైర్యం, ఆశయం, అసాధారణ సేవకు నిలువెత్తు నిదర్శనం. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చెరకు ఉత్పత్తిదారు అయినప్పటికీ...ఈ విజయానికి కారణమైన మహిళ గురించి విన్నారా అని ప్రశ్నించారు. ఈ అమ్మళ్ కథ భారతీయ మహిళలకు ప్రేరణ అని చెప్పారు.
వృక్షశాస్త్రంలో పిహెచ్‌డి చేసిన తొలి భారత మహిళ అమ్మల్. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తియ్యగా ఉండే.. అధిక దిగుబడినిచ్చే చెరకు రకాలను అభివృద్ధి చేసి, ప్రధాన ఆర్థిక లాభాలను అంచిందని తెలిపారు. ఆమె అద్భుతమైన రచనలు కూడా చేశారని తెలిపారు. కానీ పాఠ్య పుస్తకాల్లో ఆమె గురించి చాలా తక్కువగానే ప్రస్తావించారన్నారు. చెప్పాలంటే ఆమె కథ యువతరానికి అస్సలు తెలియదనే చెప్పొచ్చు.
పెళ్లి కూడా చేసుకోలేదు..
మహీంద్రా అమ్మళ్ జీవితాన్ని హైలైట్ చేస్తూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు. 1932లో, వృక్షశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని సంపాదించిన తొలి భారతీయ మహిళ, అలాగే శాస్త్రీయ పరిశోధనకు పూర్తిగా అంకితమై వివాహాన్ని కూడా తిరస్కరించారని చెప్పారు. జన్యు శాస్త్రవేత్తగా కోయంబత్తూరులోని చెరకు పెంపకం సంస్థలో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చింది. అయితే ఆ టైంలో భారత్ చెరకుకి తీపి తక్కువగా ఉండేదట.
అందుకే భారత్ ఆగ్నేయాసియా దేశమైన పాపువా న్యూ గినియా నుంచి చెరుకుని దిగుమతి చేసుకునేదట. కానీ అమ్మల్ హైబ్రిడ్ క్రాస్-బ్రీడింగ్‌లో చేసిన కృషికి భారత్ నేలే స్వయంగా తియ్యటి చెరకును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందుకుంది. దాంతో దిగుమతిదారుగా ఉన్న భారత్ కాస్తా ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారులలో ఒకటిగా మారేందుకు దారితీసిందట. ఆమె ఆవిష్కరణలు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెట్టి.. దేశానికి గణనీయమైన ఆదాయాన్ని అందించాయన్నారు మహీంద్రా
India is the world’s 2nd-largest sugarcane producer.
But the woman who made it possible slipped into the footnotes of our history.
Hers is an extraordinary story of courage, ambition and service.
She is an outstanding role model for all young Indian women.
Yet how many… pic.twitter.com/gZIsEKEto1— anand mahindra (@anandmahindra) December 8, 2025
వివక్షను ఎదుర్కొంటూనే సక్సెస్..
అమ్మళ్ ఒంటరి మహిళ, కులం కారణంగా తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారట. భారతదేశంలోని సవాళ్లు ఆమెను లండన్‌కు తరలివెళ్లిపోయేలా చేసిందట. అక్కడ ఆమె రెండొవ ప్రపంచ యుద్ధం టైంలో కూడా తన పరిశోధనను కొనసాగించింది. అలా ఆమె అంతర్జాతీయ కృషి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన వృక్షశాస్త్రజ్ఞురాలిగా ఆమె ఖ్యాతిని సుస్థిరం చేసింది.
నెహ్రూ చొరవతో మళ్లీ భారత్‌కి..
1951లో, జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు, జానకి అమ్మళ్ సెంట్రల్ బొటానికల్ లాబొరేటరీకి నాయకత్వం వహించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అంతేగాదు జీవవైవిధ్య పరిరక్షణలో మార్గదర్శకురాలిగా మారింది. ఇంత ఘనత సాధించిన ఆమె పేరు పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం బాధకరం అని పోస్ట్ ముగించారు..
(చదవండి: ఓర్నీ ఇదేంటిది..! అత్తారింటికి నవవధువే డ్రైవ్ చేసుకుంటూ..)


