సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంట్ చూశాక.. తన టార్గెట్ పెద్దదిగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రమఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్" కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం జరిగింది.
ఆ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. యువత, మహిళల అభివృద్ధి ఇందులో ఉందని ఈ డ్యాకుమెంట్ రూపొందించినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్‌లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ తమకెంతో ప్రత్యేకమని ఆనంద్ మహీంద్రా అన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం రంగంలో ఉన్న తనకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమ ఉజ్జీగా అనిపించారని తెలిపారు. ప్రస్తుతం ఎంత ఏఐ, డిజిటల్ సాంకేతికతలు వచ్చినా హ్యుమన్ టచ్‌కు ఉన్న ప్రత్యేకత వేరని ఆ స్కిల్‌ను భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీర్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఎంతోమంది వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున ఒప్పందాలు చేసుకుంది. మంగళవారంతో ఈ సమ్మిట్ ముగియనుంది.


