బ్రహ్మంగారి మఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారమై నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. ఈశ్వరీదేవి మఠంలో నేటి గురువారం నుంచి అమ్మవారి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చరిత్ర, ఉత్సవాల విశేషాలపై ప్రత్యేక కథనం.
శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ప్రబోధకర్త, రాజయోగి, హేతువాది, మహిమాన్వితులు, తత్వవేత్త, సంఘ సంస్కర్త, దైవస్వరూపులుగా వినుతికెక్కారు. ఆయన మనువరాలు శ్రీ ఈశ్వరీదేవి. ఆమె జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఎక్కువగా భవిష్యత్తును తెలియజేస్తే.. ఈశ్వరిదేవి నోటి నుంచి వెలువడే మాటలు అప్పటికప్పుడే జరిగి తీరేవి.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి ΄ార్వతీదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె 1703లో స్వస్తిశ్రీ స్వభాను నామసంవత్సరంలో జన్మించారు. వీరబ్రహ్మేంద్రస్వామి రెండో కుమారుడైన గోవిందయ్యస్వామి, గిరియమ్మ దంపతులకు ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ అనే ముగ్గురు కుమార్తెలు, ఓంకారమయ్య, సాంబమూర్తి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
వారిలో ఈశ్వరమ్మ పెద్దకుమార్తె. బ్రహ్మంగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అందరి పిల్లల్లాగా.. వీధి బడిలో సామాన్య విద్యనభ్యసించారు. సంస్కృతం, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించారు. భారత భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించే వారు. నిత్యం యోగం అభ్యసించుట, గ్రంథాల పఠనంతోనే గడుపుతుండేది.
12 ఏళ్ల వయసులోనే...
ఒకరోజు గోవిందయాచార్య శయ్యపై పరుండి, తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా మూడు రోజులు ఉన్నారు. పిలిచినా పలకలేదు. దీంతో చనిపోయారేమోనని భావించి.. ఆయన భార్య గిరియమ్మ, బంధుమిత్రులు దుఃఖించటం ప్రారంభించారు. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్న ఈశ్వరీదేవి వచ్చి.. దుఃఖించే అంత పని ఏమి జరగలేదని, నాయన పరమాత్మతో ఆత్మను లీనం చేశారని తెలిపారు. ఆమె గది తలుపులు వేసి సాంబ్రాణి ధూపం వేశారు.
వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ‘ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః’ అనే బీజాక్షరి మంత్రాన్ని జపించారు. వెంటనే గోవిందయ్య లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని చూసిన జనం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈశ్వరీదేవి సామాన్య మనిషి కాదని, మహిమాన్వితురాలని గుర్తించారు. తండ్రినే గురువుగా భావించి.. ఆయన ద్వారా మంత్రోపదేశం నేర్చుకున్నారు.
14 ఏళ్లు తపస్సు చేసి...
బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్నసాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేయడానికి సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు.
మఠాధీశులై...
తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్యపూజ కార్యక్రమాలు, ఆరాధన గురు పూజోత్సవాలు నిర్వహిస్తుండేవారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. రాజయోగినిగా మారి, శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. భక్తులకు ఎన్నో లీలలు ప్రత్యక్షంగా చూపించారు. ఎందరినో సంస్కరించి జ్ఞాన దీప్తిలా భాసిల్లి.. జనుల గుండెల్లో అమ్మవారిగా కొలువైనారు.
సజీవ సమాధి
ఈశ్వరమ్మ వారు 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటినుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. చిన్నమఠం శ్రీ ఈశ్వరిదేవిమఠంగా పేరొందినది. అమ్మవారు సజీవ సమాధి నిష్ట పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గురువుగా భావిస్తారు కనుక శిష్యులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.
భారీగా భక్తుల రాక
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వీరి సౌకర్యం కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనుంది.
ఆరాధనోత్సవాలు
నేటి నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో రోజూ ఉదయం ప్రభాతసేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం సూక్త΄ారాయణం, అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భక్తుల కాలక్షేపం కోసం సంగీత విభావరి, హరికథలు, భజన కార్యక్రమాలు ఉంటాయి.
11న కలశోత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
12న ఉదయం అశ్వవాహనం, రాత్రి హంస వాహనంపై అమ్మవారి ఊరేగింప
13న (ఈశ్వరీదేవి మార్గశిర బహుళ నవమిన మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన రోజు) ఉదయం దేవతా ఆవాహనం, శాంతి హోమం, సామూహిక కుంకుమార్చనలు, మధ్యాహ్నం దీక్షా అలంకరణ ఉత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, తులాభారం, ఊయల సేవ, రాత్రి సింహ వాహన గ్రామోత్సవం ఉంటాయి.
14న గుడి ఉత్సవం, రాత్రి పుష్పరథోత్సవం
15న పూర్వపు మఠాధిపతులు వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన, గ్రామోత్సవం
16న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి.
– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడప
(చదవండి: అరటిచెట్టు వెనక ఆధ్యాత్మిక రహస్యం)


