breaking news
eshwari bai
-
ఈశ్వరీ..జగదీశ్వరీ..
బ్రహ్మంగారి మఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారమై నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. ఈశ్వరీదేవి మఠంలో నేటి గురువారం నుంచి అమ్మవారి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి చరిత్ర, ఉత్సవాల విశేషాలపై ప్రత్యేక కథనం.శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ప్రబోధకర్త, రాజయోగి, హేతువాది, మహిమాన్వితులు, తత్వవేత్త, సంఘ సంస్కర్త, దైవస్వరూపులుగా వినుతికెక్కారు. ఆయన మనువరాలు శ్రీ ఈశ్వరీదేవి. ఆమె జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఎక్కువగా భవిష్యత్తును తెలియజేస్తే.. ఈశ్వరిదేవి నోటి నుంచి వెలువడే మాటలు అప్పటికప్పుడే జరిగి తీరేవి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి ΄ార్వతీదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె 1703లో స్వస్తిశ్రీ స్వభాను నామసంవత్సరంలో జన్మించారు. వీరబ్రహ్మేంద్రస్వామి రెండో కుమారుడైన గోవిందయ్యస్వామి, గిరియమ్మ దంపతులకు ఈశ్వరమ్మ, కాశమ్మ, శంకరమ్మ అనే ముగ్గురు కుమార్తెలు, ఓంకారమయ్య, సాంబమూర్తి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఈశ్వరమ్మ పెద్దకుమార్తె. బ్రహ్మంగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అందరి పిల్లల్లాగా.. వీధి బడిలో సామాన్య విద్యనభ్యసించారు. సంస్కృతం, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించారు. భారత భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించే వారు. నిత్యం యోగం అభ్యసించుట, గ్రంథాల పఠనంతోనే గడుపుతుండేది. 12 ఏళ్ల వయసులోనే... ఒకరోజు గోవిందయాచార్య శయ్యపై పరుండి, తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా మూడు రోజులు ఉన్నారు. పిలిచినా పలకలేదు. దీంతో చనిపోయారేమోనని భావించి.. ఆయన భార్య గిరియమ్మ, బంధుమిత్రులు దుఃఖించటం ప్రారంభించారు. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్న ఈశ్వరీదేవి వచ్చి.. దుఃఖించే అంత పని ఏమి జరగలేదని, నాయన పరమాత్మతో ఆత్మను లీనం చేశారని తెలిపారు. ఆమె గది తలుపులు వేసి సాంబ్రాణి ధూపం వేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపిన ‘ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః’ అనే బీజాక్షరి మంత్రాన్ని జపించారు. వెంటనే గోవిందయ్య లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని చూసిన జనం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈశ్వరీదేవి సామాన్య మనిషి కాదని, మహిమాన్వితురాలని గుర్తించారు. తండ్రినే గురువుగా భావించి.. ఆయన ద్వారా మంత్రోపదేశం నేర్చుకున్నారు. 14 ఏళ్లు తపస్సు చేసి... బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్నసాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేయడానికి సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. మఠాధీశులై... తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్యపూజ కార్యక్రమాలు, ఆరాధన గురు పూజోత్సవాలు నిర్వహిస్తుండేవారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. రాజయోగినిగా మారి, శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. భక్తులకు ఎన్నో లీలలు ప్రత్యక్షంగా చూపించారు. ఎందరినో సంస్కరించి జ్ఞాన దీప్తిలా భాసిల్లి.. జనుల గుండెల్లో అమ్మవారిగా కొలువైనారు.సజీవ సమాధి ఈశ్వరమ్మ వారు 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటినుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. చిన్నమఠం శ్రీ ఈశ్వరిదేవిమఠంగా పేరొందినది. అమ్మవారు సజీవ సమాధి నిష్ట పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గురువుగా భావిస్తారు కనుక శిష్యులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు.భారీగా భక్తుల రాకదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వీరి సౌకర్యం కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనుంది.ఆరాధనోత్సవాలు నేటి నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో రోజూ ఉదయం ప్రభాతసేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం సూక్త΄ారాయణం, అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్యం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భక్తుల కాలక్షేపం కోసం సంగీత విభావరి, హరికథలు, భజన కార్యక్రమాలు ఉంటాయి.11న కలశోత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.12న ఉదయం అశ్వవాహనం, రాత్రి హంస వాహనంపై అమ్మవారి ఊరేగింప13న (ఈశ్వరీదేవి మార్గశిర బహుళ నవమిన మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన రోజు) ఉదయం దేవతా ఆవాహనం, శాంతి హోమం, సామూహిక కుంకుమార్చనలు, మధ్యాహ్నం దీక్షా అలంకరణ ఉత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, తులాభారం, ఊయల సేవ, రాత్రి సింహ వాహన గ్రామోత్సవం ఉంటాయి. 14న గుడి ఉత్సవం, రాత్రి పుష్పరథోత్సవం 15న పూర్వపు మఠాధిపతులు వీరబ్రహ్మయాచార్య స్వాముల వారి ఆరాధన, గ్రామోత్సవం16న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. – వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడప(చదవండి: అరటిచెట్టు వెనక ఆధ్యాత్మిక రహస్యం) -
దళిత ఫైర్ బ్రాండ్ ఈశ్వరీబాయి
మూలవాసీ చైతన్యానికి నిలువెత్తు ప్రతీక ఈశ్వరీబాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన దళిత ఫైర్‌బ్రాండ్. 1918 డిసెంబర్, 1న హైదరాబాదు చిలకలగూడాలోని సాధారణ దళిత కుటుంబంలో రాములమ్మ, బలరామస్వామి దంపతులకు జన్మించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలలో ప్రావీణ్యమున్న ఈశ్వరీ బాయి ఉపాధ్యాయురాలిగా ఉంటూనే, రాజకీయ, సామాజిక, పోరాటాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1942 జూన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత నిమ్న కులాల సభకు ఆమె హైదరాబాదు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. అంబేడ్కర్‌ను కలిసారు. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి చురుకుగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. చిలకలగూడా కార్పోరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. 1967లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969 తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1972లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు పదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకురాలి పాత్రలో సమర్థవంతంగా రాణించి, అసెంబ్లీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 1952 నుండి 1990 వరకు 4 దశాబ్దాలకు పైగా ప్రజా సేవారంగాలలో పనిచేస్తూ, దళి తులు వెనుకబడిన వారి కోసం అవిరళ కృషి చేసారు. రాజకీయాలలో కుల ప్రభావాన్ని తట్టుకొని నిలబడ్డ ఈశ్వరీబాయి నేటి దళిత సమాజానికి దిక్సూచి. ఈ దళిత ఫైర్ బ్రాండ్ 1991 ఫిబ్రవరి 24న కన్నుమూసారు. డా. యస్. బాబూరావు, స్వతంత్ర జర్నలిస్ట్, కావలి మొబైల్ : 95730 11844 -
పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై జన్మించిన ధీరవనిత ఈశ్వరీబాయి జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, మరింతగా సమాజానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆమె వర్ధంతిసభను ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 94 ఏళ్ల తర్వాత కూడా ఈశ్వరీబాయి గురించి మనం మాట్లాడుకొంటున్నామంటే ఆమె ఆ రోజుల్లో సమాజం కోసం ఎంతగా పనిచేసి ఉంటారో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అన్నారు. పేద కుటుంబం, దళితవర్గంలో జన్మించిన మహిళ అయి కూడా సమాజం బాగుకు ధైర్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. అధికార పార్టీకి చెందిన మంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ధీరవనిత అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా తిరస్కరించిందని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకుందని, కుల, మత విశ్వాసాలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిందన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలకపాత్ర పోషించిందని తెలిపారు. 90 ఏళ్ల క్రితమే ఎదిగి, ఎన్నికల్లో కొట్లాడి, ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాంఘిక సంస్కరణలకు కారణభూతురాలు అయిందని తెలిపారు. ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారు తెలంగాణగడ్డపై పుట్టిన ఎంతోమంది మహనీయులచరిత్రను ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం పదవి చేపట్టిన తర్వాత అధికారికంగానే ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని జరుపుకొం టున్నామన్నారు. ఇప్పుడు తపాలా శాఖ కూడా ఈశ్వరీబాయి పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను అందరూ చదువుకుని ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం అందరికీ ఆదర్శవంతం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన వీరనారి ఈశ్వరీబాయి అని కొనియాడారు. ఆమె తెలంగాణ పోరాటయోధురాలు, ధీర వనితన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా జనం హృదయాల్లో నిలిచిన వనిత అని చెప్పా రు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల క్రితం భౌతికంగా వదిలి వెళ్లినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఈశ్వరీ బాయి ఉండి పోయారన్నారు. బాగా చదువుకొని డాక్టర్ కావాలని, రాజకీయాల్లోకి మాత్రం రావద్దని చెప్పేవారన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ స్వశక్తితో పైకి వచ్చిన ఓ గొప్ప మహిళ ఈశ్వరీబాయి అని అన్నారు. అనంతరం ఈశ్వరీబాయిపై రూపొందిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ నందన్, డాక్టర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. -
బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈశ్వరీబాయి
హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఈశ్వరీబాయి అని పార్లమెంట్లో కాం గ్రెస్ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే శక్తులను అడ్డుకున్నప్పుడే ఈశ్వరీబాయికి నిజమైన నివా ళ్లు అర్పించినట్లని చెప్పారు. బుధవారం ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ఈశ్వరీబాయి మెమోరియల్ సెంచ రీ అవార్డును ప్రజా గాయకుడు గద్దర్‌కు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు వి.హన్మంతరావు, మధుయాష్కి, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి కె.రత్నప్రభ, రామన్ మెగసెసే అవార్డు గ్రహిత ప్రొఫెసర్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు. -
అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి
హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధురాలు ఈశ్వరీబాయి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈశ్వరీబాయి కుమార్తె మాజీ మంత్రి గీతారెడ్డి కేసీఆర్‌ను కలిశారు. తన తల్లి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గీతారెడ్డి విజ్ఞప్తి చేయగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరి 24న ఈశ్వరీబాయి వర్ధంతి నిర్వహిస్తారు.


