సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయిల్ సప్లయ్ కాంట్రాక్టర్ పట్ల సీఐ, ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించారు. గోవింద మాల దీక్షలో ఉన్న భాస్కర్ రెడ్డిపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
ఆయిల్ సప్లయ్ కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం సమయంలో సిటీలోకి ఆయిల్ ట్యాంకర్ అనుమతి లేదని ట్యాంకర్ వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. రాత్రి ఎనిమిది గంటల తరువాత రావాలని డ్రైవర్‌కు పోలీసులు చెప్పారు. దీంతో, రాత్రే వస్తానని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో ట్యాంకర్ డ్రైవర్.. యజమాని భాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి ఎస్‌ఐతో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆగ్రహించిన పోలీసులు.. డ్రైవర్‌ను కొట్టారు. ఈ నేపథ్యంలో గోవింద మాలలో ఉన్న ట్యాంకర్ యజమాని భాస్కర్ రెడ్డి హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. డ్రైవర్‌ను కొట్టడంపై ప్రశ్నించారు.
అనంతరం, రద్దీ సమయంలో కూడా ఆయిల్ సరఫరాకి నగరంలోకి వచ్చేందుకు అనుమతి ఉందని పోలీసులు పత్రాలను చూపించారు. దీంతో, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టేషన్‌లో భాస్కర్ రెడ్డి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. తన పట్ట దురుసుగా ప్రవర్తించారని, కొట్టారని ఆరోపించారు. ఈ సందర్బంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంకర్‌కు అనుమతి ఉన్నా చలాన్లు రాశారు. చలాన్లు కట్టేందుకు స్టేషన్‌కు వెళితే నన్నే తిట్టి.. మాలలో ఉన్న నాపై చేయి చేసుకున్నారు అని తెలిపారు. దీంతో, పోలీసుల తీరుకు నిరసనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రెడ్డి ధర్నాకు దిగారు.


