● చెడుకు దూరం, మంచి మార్గానికి దోహదపడే నెల
● పంచ సూత్రాలు పాటించాలంటున్న మత పెద్దలు
● మరికొన్ని రోజులే రంజాన్ మాసం
● అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలంటున్న గురువులు
రాజంపేట టౌన్ : పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. అందువల్ల అనేక మంది ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉంటున్నారు. అయితే కొంత మంది తమ విధుల నిర్వహణ వల్ల రంజాన్ మాసంలో చేపట్టే పవిత్ర కార్యక్రమాలు చేపట్ట లేకపోతున్నారు. ఇంకొంత మంది పెద్దల మాట పెడచెవిన పెట్టి ఈ పవిత్ర మాసంలో చేపట్టాల్సిన పుణ్యకార్యాలను చేయడం లేదు. అయితే పవిత్ర రంజాన్ మాసంలో కనీసం కొన్ని రోజులైనా ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉండాలని ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. అప్పుడే మనిషి మంచిమార్గంలో పయనించి ఇతరుల పట్ల ప్రేమ, దయ కలిగివుండటంతోపాటు పేదల ఆకలి బాధలు కూడా తెలుసుకోగలరని, తద్వారా ఆకలితో బాధపడే పేదల ఆకలి తీర్చగల గొప్ప వ్యక్తులుగా తయారవుతారని వారు చెబుతున్నారు. పవిత్ర రంజాన్ మాసం మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నందున ఇప్పటికి కూడా ఉపవాసాలు ఉండని వారు, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టని వారు.. ఉపవాసాలు ఉంటూ, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టాలని మత పెద్దలు సూచిస్తున్నారు.
సర్వమానవాళి శాంతిమార్గంలో నడవాలని ఇస్లాం సూచిస్తుంది. ప్రతి ఒక్కరు చెడుకు దూరంగా, సన్మార్గంలో నడవాలని బోధిస్తుంది. అల్లాహ్ ప్రసాదించిన పవిత్ర గ్రంధం దివ్యఖురాన్. ఈ గ్రంధం అవతరించింది రంజాన్ మాసంలోనే. ఈ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మికంగా గడిపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను మహమ్మద్ ప్రవక్త సూచించారు. అవే ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర. వీటిలో నమాజ్, రోజా, జకాత్‌ను ప్రతి ముస్లిం రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించాలి. మరోవైపు మంచి విద్య నేర్చుకునేందుకు, ఇతరులకు బోధించేందుకు అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలని మతపెద్దలు చెబుతున్నారు.
ఈమాన్
ఇస్లాం మత మొదటి నియమం ఈమాన్. లాయిలాహ ఇల్లల్లాహ్ మహమ్మదూర్ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం) అని కలిమా తయ్యిబా చదివి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ అందుకు కట్టుబడి ఉండాలి. అల్లాయే భగవంతుడని, ఇతరులకు దైవారాధన చేయరాదని ఈ విషయం చెబుతుంది. ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాపై మాత్రమే విశ్వాసాన్ని ఉంచాలి.
నమాజ్
కలిమా తయ్యిబా చదివి ఈమాన్‌తో ఇస్లాం స్వీకరించిన ప్రతి ముస్లిం రోజుకు ఐదు పూటలా విధిగా నమాజ్ చదవాలి. సూర్యోదయానికి ముందు ఫజర్, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత జోహర్, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అసర్, సూర్యాస్తమయం తరువాత మగ్‌రిబ్, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇషా నమాజు చేయాలి.
రోజా
రోజా అంటే ఉపవాస దీక్ష. మానసిక పరిపక్వత కలిగి, ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి ముస్లిం రంజాన్ మాసంలో రోజా పాటించాలి. ఈమాసంలో ఉండే రోజాలను ఫజర్ రోజా అంటారు. నెలంత నియమ, నిష్టలతో ఉపవాస దీక్ష ఆచరించాలి. సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం తరువాత వరకు ఆహారం, నీరు, ఇతర ఎలాంటి తినుబండారాలు, పానీయాలను సైతం తీసుకోకుండా రోజా ఆచరించాలని ఇస్లాం చెబుతుంది. ఏడాదిలో 12 నెలల్లో ఒకనెల అల్లాకోసం ఆయన సూచించిన మార్గంలో నడిచి మిగతా నెలల్లో అదే స్ఫూర్తితో నడుచుకోవాలి.
హజ్ యాత్ర
ఆర్థిక స్థోమత కలిగిన ముస్లింలు విధిగా హజ్ యాత్ర చేయాలి. 40 రోజుల పాటు సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ప్రాంతాలకు వెళ్లి, అక్కడ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. బక్రీదు పండుగ సమయంలో హజ్ జరుగుతుంది. అప్పు చేసి హజ్ యాత్ర చేయాల్సిన అవసరం లేదు. హజ్‌యాత్రకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు కుటుంబ పోషణకు అవసరమైన నిధులు ముందుగానే సమకూర్చుకోవాలి.
అల్లాహ్ మార్గంలో నడవాలి
ఇస్లాం ధర్మాలు, నియమ నిబంధనలు, పాటించాల్సిన సూత్రాలు, ఆచరించాల్సిన పద్ధతులను తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని ఇళ్ల వద్ద ఉండి నేర్చుకోలేని పక్షంలో దైవమార్గంలో నడవాలి. తమ పనులు, వృత్తి, వ్యాపారం వంటి వాటికి కొంత కాలం పాటు దూరంగా ఉండి ‘అల్లాకే రాస్తేమే’ వెళ్లి విద్య నేర్చుకోవాలి. నేర్చుకున్న అంశాలను ఇతరులకు పంచి అందరూ మంచి మార్గంలో నడిచేలా కృషి చేయాలని ఇస్లాం సూచిస్తుంది.


