● సస్పెన్షన్లపై ఆగ్రహం
● కలెక్టరేట్ వద్ద ఆందోళన
కడప సెవెన్‌రోడ్స్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద గ్రామ సర్వేయర్లు ఆందోళన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సర్వేయర్లు తరలివచ్చారు. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు మనోజ్, ఉపాధ్యక్షులు హరినాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు రీ సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ నిర్వహించి వారి అభిప్రాయాల ఆధారంగా మాత్రమే తదుపరి రీ సర్వే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలన్నారు. తమపై ఒత్తిడి చేయకుండా ఎస్‌ఓపీ ప్రకారం తగిన సమయం ఇవ్వాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో తమతోపాటు రిక్రూట్ అయిన ఇతర విభాగాల ఉద్యోగులకు ఇస్తున్న విధంగానే.. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన సర్వేయర్లకు కనీసం రెండు ఇంక్రిమెంట్లతో కూడిన గ్రేడ్–1 పదోన్నతి కల్పించాలన్నారు. ఇతర సచివాలయ సిబ్బందితో సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. జిల్లా వారీగా 70 శాతం వరకు గ్రేడ్–ఏ ప్రమోషన్లు, సమాన పే రోల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో ముఖ్యంగా మహిళా సర్వేయర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసవి కాలంలో ఫీల్డ్‌లోకి వెళ్లి పనిచేయడం వల్ల చాలా మందికి అబార్షన్లు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉండగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి సస్పెండ్ చేయడం పట్ల గ్రామ సర్వేయర్లు భగ్గుమన్నారు. సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తాము నిరాహార దీక్షలు చేపట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ నాయకులు, పెద్ద ఎత్తున సర్వేయర్లు పాల్గొన్నారు.


