తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Mar 7 2026 8:13 AM | Updated on Mar 7 2026 8:13 AM

చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం పాయలోపల్లె వద్ద శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ మధ్య లారీ దూరి ఇరుక్కు పోవడంతో.. బస్సు సైడ్‌ భాగం దెబ్బతింది. బస్సు డ్రైవర్‌ వేమయ్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. రోడ్డుకు అడ్డంగా బస్సు, లారీ, టిప్పర్‌ నిలిచిపోవడంతో.. రాయచోటి– వేంపల్లె మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి డిపోకు చెందిన ఏపీ04 జెడ్‌ 0183 నంబరు గల ఆర్టీసీ బస్సు వేంపల్లె నుంచి రాయచోటికి వెళ్తుండేది. ఇదే సందర్భంలో రాయచోటి వైపు నుంచి ఏపీ 39 టీవై 6636 నంబరు గల టిప్పరు, దాని వెనుకే చిత్తూరు నుంచి దాల్మియాకు వెళ్తున్న ఏపీ 39 టీజీ 2789 లారీ వస్తుండేది. అయితే రాయచోటి– వేంపల్లె మధ్యన జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తి కావడంతో.. రోడ్డు బాగుండటంతోపాటు మర్రి చెట్టు వద్ద నుంచి డౌన్‌ ఉండటంతో వాహనాలు వేగంగా వస్తుంటాయి. అయితే పాయలోపల్లె వద్ద రోడ్డు పనులు జరుగుతుండటంతోపాటు స్పీడ్‌ బ్రేకర్‌ ఉంది, ఇక్కడ ఎలాంటి సూచిక బోర్డులను ఎన్‌హెచ్‌ అధికారులు ఏర్పాటు చేయలేదు. అయితే బస్సు, టిప్పరు నిత్యం ఈ మార్గంలో తిరుగుతుండేవి కావడంతో పాయలోపల్లె వద్ద రోడ్డు పరిస్థితి తెలిసినందున ఆ వాహనాల డ్రైవర్లు చిన్నగా వెళతారు. అయితే లారీ డ్రైవర్లకు అక్కడి రోడ్డు పరిస్థితి తెలియక డౌన్‌ కావడంతో స్పీడ్‌గా వస్తుంటాయి. శుక్రవారం కూడా జరిగిన సంఘటన కూడా అలాంటిదే. ముందు వస్తున్న టిప్పర్‌ స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద నెమ్మదించడంతో.. వెనుక వైపున వేగంగా వస్తున్న లోడ్‌ లారీ కంట్రోల్‌ కాక పోవడంతో డ్రైవర్‌ దాన్ని పక్కకు తిప్పాడు. ఇదే సందర్భంలో బసు డ్రైవర్‌ లారీ అదుపు తప్పిన విషయాన్ని గుర్తించి బస్సును పూర్తిగా పక్కకు తిప్పేశాడు. అప్పటికే లారీ బస్సు సైడ్‌ భాగాన్ని రుద్దుకుంటే వెళ్లి ఆగింది. దీంతో బస్సు సైడ్‌ భాగం దెబ్బతింది. ఆ సమయంలో బస్సులో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు డ్రైవర్‌ వేమయ్య తెలిపారు. బస్సు, లారీ, టిప్పర్‌ రోడ్డుకు అడ్డుగా ఉండిపోవడంతో రాయచోటి– వేపల్లె మధ్యన వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీటిలో టిప్పర్‌ గానీ లారీ గానీ రోడ్డు పక్కన ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పాయలోపల్లె వాసులు పేర్కొంటున్నారు. పాయలోపల్లె వద్ద జరిగిన ప్రమాదం విషయంపై తమ సిబ్బందిని పంపి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసి సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు చక్రాయపేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌ చెప్పారు.

బస్సు, టిప్పర్‌ మధ్య దూరిన లారీ

బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement