భళా.. రాజంపేట వైద్యశాల | - | Sakshi
Sakshi News home page

భళా.. రాజంపేట వైద్యశాల

Mar 7 2026 8:13 AM | Updated on Mar 7 2026 8:13 AM

రాజంపేట : గర్భిణి పేరు ఇరువూరి శంకరమ్మ, ఆమె భర్త సుబ్రమణ్యం. ఈ దంపతులది తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం. శంకరమ్మ గర్భసంచిలో పిండం చనిపోయింది. మూడు నెలలుగా తిరుపతిలోని అనేక పేరొందిన కార్పొరేట్‌ ఆసుపత్రులలో చూపించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. బీపీ అధికంగా ఉన్న కారణంతో కార్పొరేట్‌ ఆసుపత్రులు ఆపరేషన్‌ చేయడానికి ముందుకు రాలేదు. ఆపరేషన్‌ తర్వాత వచ్చే రక్తస్రావానికి సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భయం కార్పొరేట్‌ వైద్యులను వెంటాడింది. దీంతో చికిత్సతోపాటు ఆపరేషన్‌కు నిరాకరించారు. ఆమె ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందనే అనుమానాలతో తిరుపతి వైద్యులు ముందుకు రాలేదు. డిక్‌ డీఐసీ అనే క్లాంపికేషన్‌ వల్ల తల్లికి ప్రాణపాయం ఉందని ఆపరేషన్‌ చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం.

చివరికి రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు చేరి..

ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో శంకరమ్మను కుటుంబ సభ్యులు రాజంపేట ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీవీఎన్‌ రాజు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ అనిల్‌కు కేసును అప్పగించారు. ఈయన నేతృత్వంలో అనిస్తియా డాక్టర్‌ అబూబకర్‌, ఫిజిషియన్‌ డాక్టర్‌ గిరి, నర్సులు సరళ, శ్రీలక్ష్మీ, అసిస్టెంట్‌ విజయ్‌ తదితరులు.. శంకరమ్మ గర్భంలో మృతి చెందిన పిండాన్ని బయటికి తీసేందుకు సాహసోపేతంగా ఆపరేషన్‌ చేయడానికి ముందుకొచ్చారు. విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించారు. చనిపోయిన పిండాన్ని తీసేశారు. గర్భిణికి ఎలాంటి ప్రమాదం లేకుండా సురిక్షతమైన ఆపరేషన్‌ పకడ్బందీగా నిర్వహించారు.

ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది

శంకరమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీవీఎన్‌రాజు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ చట్టేటి అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆసుపత్రిలో శంకరమ్మ చేరిందన్నారు. రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలో జరిగిన సాహసోపేతంతో కూడిన ఆపరేషన్‌ విజవవంతం కావడం వల్ల తమకెంతో గర్వ కారణంగా ఉందన్నారు.

చికిత్స పొందుతున్న శంకరమ్మ, రాజంపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి

సాహసోపేతమైన ఆపరేషన్‌ సక్సెస్‌

గర్భిణి ప్రాణం కాపాడిన వైద్యులు

చికిత్సకు నిరాకరించిన

కార్పొరేట్‌ ఆస్పత్రులు

అక్కున చేర్చుకున్న ప్రభుత్వ దవాఖానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement