డాక్టర్ గారూ, నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. అదేమంటే, రాత్రి నేను ఎంతసేపు పడుకున్నా. రోజంతా మగత గానే ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చున్నా టీ.వి చూస్తున్నా. చివరకు భోజనం చేస్తూ చేస్తూ అలాగే పడుకుని ΄ోతాను. డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతానేమో అని ఈ మధ్య డ్రైవింగ్ చేయడం కూడా మానేశాను. అలాగే బాగా భయపడ్డా, గట్టిగా నవ్వినా కుప్పకూలిపోతాను. నేను కావాలనే ఇదంతా చేస్తున్నాననుకుని మా ఇంట్లో వాళ్లు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం లేదు. నేను సాక్షిలో మీ కాలమ్ రెగ్యులర్‌గా చదువుతాను. కనీసం మీ సమాధానం చూసైనా ఇంట్లో వాళ్ళు నన్ను డాక్టర్‌కి చూపిస్తారనే నమ్మకంతో, నా సమస్యను మీకు మెయిల్ చేస్తున్నాను!
– స్వాతి,ప్రొద్దుటూరు
మీ సమస్య చాలా ఇబ్బందికరమైనది, మీ పరిస్థితికి బాధ కూడా కలుగుతోంది. కేవలం అవగాహనా లోపం వలన సరియైన చికిత్స అందుబాటులో ఉన్న సమస్యలని కూడా పట్టించుకోక పోవడం వల్ల ఎలా జరుగుతోందో మీ విషయాన్ని బట్టి అర్థం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలని బట్టి మీరు ‘నార్కోలెప్సీ’ అనే సమస్యతో బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇది మెదడులోని ‘హైపోథాలమస్ అనే భాగం పని విధానంలో మార్పుల వలన వచ్చే ఒక న్యూరో.. సైకియాట్రిక్ డిజార్డర్. ఈ సమస్యలో నిద్రకి సంబంధించిన సాధారణ లయ దెబ్బతింటుంది. నిద్రలో వచ్చే REM & NREM అనే రెండు నిద్ర దశల క్రమ పద్ధతిలో మార్పులు ఈ సమస్యకి ప్రధాన కారణం. దాని వలన పడుకునే ముందు, నిద్రలేచే ముందు వివిధ రకాల భ్రాంతులు కలుగుతాయి.
విపరీతమైన కలలు వస్తాయి. నిద్ర లేచే ముందు శరీరం పక్షవాతానికి గురైనట్లు అనిపిస్తుంది. కాళ్లూ చేతులు కదిలించలేరు. అన్నీ వినబడతాయి, కనబడతాయి, కానీ సమాధానం చెప్పలేరు. దీని వలన విపరీతమైన భయానికి, అసౌకర్యానికీ గురౌతారు. అలాగే బాగా ఎమోషనల్ అయినప్పుడు మెలకువ స్థితిలోనే, మెదడు REM స్థితిలోకి వెళ్ళిపోతుంది. దీనివలన ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఈ అనుభవం కూడా అత్యంత భయానకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కండిషన్‌ను ‘ఫిట్స్’ అనుకొని తప్పుగా వైద్యం కూడా చేసే కేసులు కూడా చూస్తూంటాను. కొంతమంది కావాలనే ఇలా చేస్తున్నారనే అసలు చికిత్సే ఇప్పించరు.
పాలిమ్నోగ్రఫీ అనే పరీక్ష ద్వారా ఈ సమస్యను నిర్ధారించవచ్చు. అలాగే ‘స్టిమ్యులెంట్సు, కొన్ని రకాల ‘యాంటీ డిప్రెసెంట్’ మందులు వాడితే ఈ సమస్య నియంత్రణలో ఉంటుంది. ఎక్కువగా ఎమోషన్స్‌కి గురికాకుండా కౌన్సెలింగ్ కూడా తీసుకోవాలి. ఉదయంపూట కొంచెంసేపు నిద్రపోవడం కూడా ఈ సమస్యలోంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. మీరు నిరాశకు గురికాకుండా మీ ఇంట్లో వాళ్ళకి ‘సాక్షి’లో నా సలహా చూపించండి. అర్థం చేసుకొని మీకు వైద్య సహాయం అందిస్తారని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్!

డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్,
విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


