ఆందోళనతో కంటికి కునుకే కరువైంది! | Daily Routine Plan for Reducing Overthinking and Improving Sleep | Sakshi
Sakshi News home page

ఆందోళనతో కంటికి కునుకే కరువైంది!

Dec 4 2025 8:11 AM | Updated on Dec 4 2025 8:44 AM

Daily Routine Plan for Reducing Overthinking and Improving Sleep

నా వయస్సు 72 సంవత్సరాలు. ఉద్యోగం నుంచి రిటైరై దాదాపు 14 ఏళ్లయింది. నేను చాలా సంవత్సరాల నుండి ఒక సమస్యతో బాధపడుతున్నాను. అదేమిటంటే ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం. ఎప్పుడూ మనసులో గందరగోళంగా ఉంటుంది. ఈ ఆలోచన వలన చేసే పనిలో ధ్యాస ఉండదు. రాత్రి పడుకున్న తర్వాత  విపరీతంగా కలలు వస్తుంటాయి. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా ఉండడం లేదు. ఈ సమస్య ఎప్పుడు మొదలైందో గుర్తు లేదు కానీ, రిటైర్మెంట్‌ తర్వాత నన్ను మరింతగా బాధిస్తోంది. నాకు షుగర్, బీపీ కూడా ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చూడగలరు. 
–కె.ఎల్‌.వి ప్రసాద్, హైదరాబాద్‌

మీరు రాసిన లక్షణాలను బట్టి మీకున్న సమస్యను ‘యాంక్సైటీ డిజార్డర్‌‘ (నిరంతర ఆందోళన రుగ్మత) అంటారు. యాంగై్జటీ లేదా భయం అనేవి ప్రమాదాలనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రకృతి ఏర్పరచిన, ఒక ర క్షణ వ్యవస్థ. మనుషులతో పాటు జంతువుల్లో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మెదడు రసాయనాల్లో మార్పులు, చిన్న వయసులో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల, ఈ రక్షణ వ్యవస్థలో లోపం ఏర్పడుతుంది. ఆ కారణంగానే మెదడు ఆందోళనకు గురవుతూ ఉంటుంది. రోజూవారి వ్యవహారాలు, చిన్నచిన్న సమస్యలని కూడా మెదడు భూతద్దంలో చూస్తూ ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీని వల్ల ప్రశాంతత ఉండదు. చేసే పని మీద ధ్యాస ఉండదు. 

ఎప్పుడూ కంగారు కంగారుగా భయంగా ఉంటుంది. రాత్రిపూట కూడా మెదడు ఇలా ఆతిగా ఆలోచనలు చేయడం వల్ల నిద్ర కూడా పట్టదు. ఇది యుక్తవయసులోనే మొదలైతే చాలా సంవత్సరాలు ఇబ్బంది పడవలసి ఉంటుంది. తర్వాతి కాలంలో ఇది తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీయొచ్చు. దీనికి ఆధునిక వైద్య విధానంలో చక్కని పరిష్కారం ఉంది. కొన్ని ప్రత్యేకమైన మందులు, చికిత్స పద్ధతులను మానసిక వైద్యుల సూచన మేరకు కొంతకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ, సైకోడైనమిక్‌ థెరపీ, ఎక్స్‌΄ోజర్‌ థెరపీ వంటి కౌన్సెలింగ్‌ పద్దతుల ద్వారా క్లినికల్‌ సైకాలజిస్టులు ఈ సమస్య తీవ్రతని తగ్గించగలరు. మీరు దగ్గరలోని మానసిక వైద్యుని కలిసి ఖచ్చితంగా ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందగలరు. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, 
విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన 
మెయిల్‌ ఐడీ:  sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement