సూర్యాపేట జిల్లా: మునగాల మండలం బరాఖత్‌గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య నెలకొన్న భూవివాదంలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. బరాఖత్‌గూడేనికి చెందిన దొంతిరెడ్డి కళావతికి కుమారుడు ఉపేందర్‌రెడ్డి, కుమార్తె రెణబోతు జ్యోతి ఉన్నారు. ఉపేందర్‌రెడ్డి, జ్యోతి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. జ్యోతి బరాఖత్‌గూడెంలో తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి కౌలుకు ఇచ్చింది.
జ్యోతి తన భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆదివారం బరాఖత్‌గూడేనికి వచ్చి కౌలు రైతుతో కలసి వరి పంటను కోయిస్తుండగా.. అక్కడకు చేరుకున్న కళావతి, ఉపేందర్‌రెడ్డి వరికోత యంత్రాన్ని ఆపారు. అడ్డుకోవడానికి వెళ్లిన జ్యోతి, ఆమె భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలపై ఉపేందర్‌రెడ్డి దాడి చేశాడు.
అంతేకాక జ్యోతి ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘర్షణలో గాయపడిన జ్యోతి, ఇద్దరు కుమార్తెలు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కళావతి, ఉపేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.



