సాక్షి: హైదరాబాద్: రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్ -1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ సీఎంను కలిశారు. స్థానిక సంస్థల్లో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు.
అలాగే పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలో అన్ని గ్రూప్ -1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ ఉన్నారు.


