సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా..
మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు.
అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్‌లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్‌గా మారింది.
మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP
— Telangana Congress (@INCTelangana) January 8, 2026
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ‘‘దటీజ్ కేసీఆర్ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశాయి.


