సాక్షి, హైదరాబాద్: నగరంలో భవన అనుమతి గడువు ముగిసినప్పటికీ అనుమతించిన ప్లాన్ల ప్రకారమే నిర్మాణం పూర్తిచేసిన నాన్ హైరైజ్ భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) జారీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
భవన అనుమతులు పొంది, గడువు లోపల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందలేకపోయినప్పటికీ అనుమతించిన ప్లాన్ల మేరకు నిర్మాణం పూర్తి చేసిన భవనాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల నీటి, విద్యుత్ కనెక్షన్లు (HMWSSB, TSSPDCL) పొందడంలో కొనుగోలుదారులు, గృహ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు, బ్యాంకు రుణాల విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అదనపు పెనాల్టీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వెల్లడించారు.
కేసు–1:
భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల లోపు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినట్లయితే, రూల్–26 ప్రకారం పెండింగ్ భవన అనుమతి ఫీజులు, లింక్ రోడ్ ఛార్జీలు, CRMP ఛార్జీలు తదితర వర్తించే రుసుములు వసూలు చేసి దరఖాస్తును పరిశీలిస్తారు.
కేసు–2:
భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల తరువాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే, దరఖాస్తు తేదీ నాటికి మొత్తం నిర్మిత విస్తీర్ణానికి వర్తించే అన్ని రుసుములు, ఛార్జీలు వసూలు చేస్తారు.
రెండు సందర్భాల్లోనూ, తప్పనిసరి సెట్ బ్యాక్ లో (ఫ్రంట్ సెట్ బ్యాక్ మినహా) 10 శాతం లోపు వ్యత్యాసాలు ఉన్న భవనాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు నాన్ హైరైజ్ భవనాలకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో పౌరులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే అవకాశం కలుగుతుందని, మౌలిక సదుపాయాల కనెక్షన్లు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు.


