గిర్‌లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం శివాలయాన్ని ప్రారంభించారు. భక్తి, ప్రపత్తులతో పవిత్ర హారతి కార్యక్రమం నిర్వహించారు. శ్లోక పఠనంతో పరమేశ్వరుని ఆరాధించారు. అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా, ఇటీవల ముకేశ్ అంబానీ పలు ఆలయాలకు భారీ విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన ముకేశ్ అంబానీ అక్కడ అత్యాధిక వంటశాల నిర్మించనున్నట్లు ప్రకటించారు. తర్వాత ఆయన రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా శ్రీనాథ్‌జీ మందిరం, కేరళలోని గురువాయూర్ ఆలయాలను సందర్శించారు.
నాథ్ ద్వారా శ్రీనాథ్‌జీ మందిరంలో నాథ్‌ద్వారాలో అంబానీ భగవాన్ శ్రీనాథ్ జీ భోగ్ హారతి దర్శనానికి హాజరై గురు శ్రీ విశాల్ బావా సాహెబ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అక్కడ యాత్రికులకు, సీనియర్ సిటిజన్‌ల సేవా సముదాయం నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆలయానికి రూ.15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇక కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అంబానీ నెయ్యి దీపాలు వెలిగించి, ఆలయ ధ్వజ స్తంభం వద్ద నైవేద్యాలు సమర్పించారు. దేవస్వం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మొదటి విడతగా గురువాయూర్ దేవస్వంకు రూ .15 కోట్ల చెక్కును అందజేశారు.


