జీవిత ప్రయాణంలో చివరి దశ అయిన ముసలితనానికి వెరవని మనిషి సాధారణంగా ఉండడు. ముసలితనం కష్టాలను కనులకు కట్టినట్లుగా అన్ని వివరాలతో ఇలా వర్ణన చేసి చెప్పాడు కూచిమంచి తిమ్మకవి ‘కుక్కుటేశ్వర శతకం’ లోని ఒక పద్యంలో!
నోరు చేదై తినడానికి వీలుగాక భోజనం రుచి తప్పుతుంది; శరీర పటుత్వం తగ్గి వొడలెల్ల వణకడం మొదలవుతుంది; పోను పోను వినికిడి శక్తి తగ్గిపోయి, చివరికి చెవులకు చెవుడు వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎప్పుడూ ఏదో ఒక రుగ్మత శరీరాన్ని బాధపెడుతుంది. దాని వలన ఎప్పుడూ ఒక రకమైన ‘నిత్యదిగులు’ మనసులో తిష్ఠ వేసుకుని కూర్చున్న కారణంగా రోజులన్నీ దిగులుగానే గడవడం ప్రారంభమవుతుంది. కళ్ళ సంగతి ఇక చెప్పనే అవసరం లేదు, అవి అప్పటికే సులోచనాల పాలై ఉంటాయి. అదనంగా శుక్లాల వంటివి తయారై చూపును పూర్తిగా కమ్మేసి ఏదీ కనపడకుండా చేస్తాయి. ఇవన్నీ అలా వుండగా, అన్నిటికంటే అవమానకరంగా, పడుచువాళ్ళు పరిహాసాలాడుతూ పకపకా నవ్వడాలను కాదనలేక, ఏమీ చేయలేక చూస్తూ ఊరుకోవలసి వస్తుంది.
తే. మది దలంపగ గటకటా! ముదిమి యంత
రోత లేదుగదా! ధారుణీతలమున,
భూనుతవిలాస, పీఠికాపుర నివాస
కుముద హితకోటి సంకాశ, కుక్కుటేశ!
ఇలా ఇన్నిరకాల అసౌకర్యాలతోనూ, అవమానాలతోనూ కూడినదైన ఈ ముసలితనాన్ని మించిన కష్టం, లోకంలో మరింకేమి ఉంటుంది చెప్పవయ్యా స్వామీ, ఓ పిఠాపుర నివాస శ్రీ కుక్కుటేశ్వర స్వామీ! – అంటూ, కష్టాలతో కూడినదైన ఈ ముసలితనం బాధ నుంచి తప్పించి, ముక్తిని ప్రసాదించు స్వామీ అన్నది విన్నపం. అంటే దేవుని దయ ఉంటే వృద్ధాప్య కష్టాలనైనా అధిగమించడం సులభమే!
– భట్టు వెంకటరావు


